పరిషత్తు.. కసరత్తు

MPTC And ZPTC Elections Arrangements Start - Sakshi

సాక్షి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల కోసం అన్ని పార్టీలూ కసరత్తు మొదలుపెట్టాయి. అసెంబ్లీ, సర్పంచ్, పార్లమెంట్‌ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తెరలేచింది. ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్‌ విడుదల కానున్న నేపథ్యంలో పార్టీల నాయకులు ప్రణాళికలు రూపొందించుకునే పనిలోపడ్డారు. దూకుడుమీదున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కేసీఆర్‌ నేతృత్వంలో సోమవారం సమావేశంకాగా.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తపరిచేందుకు కాంగ్రెస్‌ మండలాల వారీగా సమావేశాలకు శ్రీకారం చుట్టింది.

టార్గెట్‌ చైర్మన్‌
అసెంబ్లీ, సర్పంచ్‌ విజయాలతో దూకుడు మీదున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పరిషత్‌ చైర్మన్‌లను కైవసం చేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ విజయం తమదేనంటున్న గులాబీ శ్రేణులు అదే ఉత్సాహంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి అధికారం కూడా టీఆర్‌ఎస్‌ చేతిలో ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సాఫీగా సాగుతాయనే భావనతో టీఆర్‌ఎస్‌ పెద్దలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవాలని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో పిలుపునిచ్చారు. అందులోభాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని  నాలుగు జిల్లా ప్రజాపరిషత్‌లు, 66 మండల పరిషత్‌లను కైవ సం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పరిషత్‌ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తరలివెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ప్ర జాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు సమన్వయంతో అన్ని జిల్లా ప్రజాపరిషత్‌లను కైవసం చేసుకోవాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులుగా సమర్థవంతులను ఎంపిక చేసుకోవాలన్నారు. అలాగే ఇటీవ ల ఉమ్మడి జిల్లాలో ఓటమి చెందిన ఏకైక పార్టీ అ భ్యర్థి కోవ లక్ష్మికి జెడ్పీ చైర్‌పర్సన్‌ అవకాశం క ల్పించారు. ఆసిఫాబాద్‌ టీఆర్‌ఎస్‌ జెడ్పీ చైర్‌పర్స న్‌ అభ్యర్థిగా కోవ లక్ష్మి పేరును కేసీఆర్‌ ప్రకటిం చారు. అలాగే పరిషత్‌ ఎన్నికల బాధ్యతలు పార్టీ నేతలకు అప్పగించిన సీఎం, ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం జెడ్పీ స్థానాలు గెలవాలని తేల్చిచెప్పారు.

పోరుకు కాంగ్రెసై
అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల్లోనైనా ఉనికి చాటుకోవా లని ఉబలాటపడుతోంది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి ఘన విజయంతో ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ.. అదే ఊపుతో మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలను దక్కించుకోవాలని యోచిస్తోంది. దీనికోసం ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండలాల వారిగా పార్టీ నాయకులు, క్యాడర్‌తో మంతనాలు జరుపుతున్నారు. మంచిర్యాలలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమయ్యారు.

ఆయా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల పేర్లను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీనితోపాటు కాంగ్రెస్‌ పార్టీకి వీలైనన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే మండలాల వారిగా కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలను నిర్వహిస్తూ, పార్టీ క్యాడర్‌ను స్థానిక పోరుకు సమాయత్తం చేసే పనిలో కాంగ్రెస్‌ నేతలున్నారు. పార్టీ గుర్తులతో జరిగే పరిషత్‌ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోవడానికి టీఆర్‌ఎస్, పునరుత్తేజం పొందడానికి కాంగ్రెస్‌ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top