మన చలానాలూ.. సదుపాయాలూ తక్కువే | Motorists and Drivers worry about New traffic challans | Sakshi
Sakshi News home page

మన చలానాలూ.. సదుపాయాలూ తక్కువే

Sep 8 2019 3:40 AM | Updated on Sep 8 2019 8:18 AM

Motorists and Drivers worry about New traffic challans - Sakshi

భువనేశ్వర్‌లో ఓ ఆటో డ్రైవర్‌కి ట్రాఫిక్‌ పోలీసులు రూ.45వేలు జరిమానా విధించారు. రోజుకు రూ.500 కిరాయి చెల్లించి నడుపుకుంటున్న ఆటోకి, అంత చలానా ఎక్కడి నుంచి తేవాలంటూ బోరుమన్నాడు.

ఢిల్లీలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ వాహనదారుడికి రూ.25 వేల జరిమానా పడింది. రూ.13 వేలు పెట్టి సెకండ్‌ హ్యాండ్‌లో కొన్న బైకుకు అంత జరిమానా చెల్లించలేనంటూ పోలీసుల వద్దే దాన్ని వదిలిపోయాడు.   – సాక్షి, హైదరాబాద్‌ 

మోటారు వాహన సవరణ చట్టం– 2019 ప్రస్తుతం తెలంగాణలో అమలు కాకున్నా.. వాహన దారులను మాత్రం బెం బేలెత్తిస్తోంది. అమలులో జాప్యం ఉండ వచ్చు గానీ, అమలు మాత్రం ఖాయమన్న సంగతిని వాహనదారులకు పోలీసులు ప్రచారం ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో ఇప్పటికే భారీ జరిమా నాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కానీ, పోలీసులు చెబుతున్న ట్రాఫిక్‌ జరిమానాలు చాలా మంది నెల వేతనం కంటే అధికంగా ఉండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక నిజంగానే ఫైన్‌ కట్టాల్సి వస్తే తమ గతేం కాను అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్‌ వృత్తిగా జీవించే ఆటో, క్యాబ్, బస్సు, లారీ డ్రైవర్లు తీవ్ర మథన పడిపోతున్నారు.

వీరిలో చాలా మంది బండ్లను ఫైనాన్స్‌లో తీసుకుని నెల వాయిదాలు కట్టుకుంటున్నారు. కొత్త జరిమానాలు అమలులోకి వస్తే.. తమ ఆదాయం, ఫైనాన్స్‌ వాయిదాలకంటే అవే అధికంగా ఉంటే తమ బతుకులు రోడ్డు పాలు అవుతాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది డ్రైవర్ల కనీస వేతనం రూ.8,000 నుంచి రూ.15 వేల వరకు ఉంది.  ఇక నెలలో రెండు ఫైన్లు పడితే రూ.10 వేలు జేబుకు చిల్లు పడుతుం దని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే ఓనర్లు తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని వారు అంటున్నారు. ఫైనాన్స్‌లో కొని సొంతంగా  నడుపుకునే ఆటో, క్యాబ్‌లలో నెల కిస్తీ రూ.8000 నుంచి రూ.13,500 నుంచి మొదలవుతాయి. రోడ్డు, పార్కింగ్‌ సదుపాయాలు మెరుగు పరచకుండా ఇష్టానుసారంగా ఫైన్లు విధించడం సబబు కాదంటున్నారు.

పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు..
ప్రమాదాల నివారణలో భాగంగా చలానాలు విధించడాన్ని తప్పుబట్టడం లేదు. కానీ, సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్న చలాన్లపై పునరాలోచించుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. అదే సమయంలో చలానాలు విదేశాలతో పోలిస్తే.. మన వద్దే తక్కువ అయితే సంతోషమే. కానీ, ఆయా దేశాల్లో ఉన్నంత అక్షరాస్యత, విశాలమైన, నాణ్యమైన రోడ్లు, మెరుగైన వైద్య సదుపాయాలు, ప్రమాద స్థలానికి నిమిషాల్లో చేరుకోగలిగే హెలికాప్టర్‌ అంబులెన్సులు, గోల్డెన్‌ అవర్‌ ట్రీట్‌మెంట్లు, ఉచిత వైద్యం తదితర సదు పాయాలు ఇక్కడా ఉండాలి కదా మరి? అని వారు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement