
తాడూరు: గంగమ్మ నింగికెగిసింది.. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అవడంతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ సమీపంలో చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్–కల్వకుర్తి ప్రధాన రహదారి వెంబడి మేడిపూర్ సమీపంలోని ఆదివారం సాయంత్రం భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడటంతో నీరు పైకి ఎగజిమ్మింది. నీటి ఉధృతికి దాదాపు 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆకాశానికి ఎగిసిపడుతున్న నీటిని చూసి కొంతమంది వాహనదారులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మేడిపూర్ వాసులు మిషన్ భగీరథ పర్యవేక్షణ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలోని ఎంగంపల్లి చౌరస్తాలోని గేట్‌వాల్వ్ వద్ద నీటిని నిలిపివేశారు. అయినా రెండు గంటల పాటు నీటి ప్రవాహం అలాగే కొనసాగింది.