 
															అపోహలను పంటాపంచలు చేశాం: మంత్రి
ప్రాణహిత గోదావరి నీటితో తెలంగాణలోని బీడు భూములను నీరిచ్చే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకున్నారని మంత్రి కె తారకరామారావు అన్నారు.
	కుత్బుల్లాపూర్: నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి ఏ మాట అయితే అన్నాడో.. నా తెలంగాణ కోటి రతనాల వీణతో పాటు కోటి ఎకరాల మాగాణి కూడా కావాలన్న బృహత్తర కార్యక్రమంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుకు సాగుతున్నారని  ఐటీ శాఖ మంత్రి  కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణలో కాలేశ్వరం నది నుంచి ప్రాణహిత గోదావరి నీటితో తెలంగాణలోని బీడు భూములను నీరిచ్చే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు. కొంపల్లి గ్రామంలో అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా రూ.628 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 190 గ్రామాలకు మంచి నీటి పైపులైన్ పనుల పైలాన్‌ను బుధవారం ఆవిష్కరించారు.
	
	ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు 160 కీలోమీటర్ల విస్తీర్ణంలో  7మున్సిపాలిటీలు, 12 మండలాల్లో ఈ పనులు జరుగుతాయని తెలిపారు.  ప్రస్తుతం 7 మిలియన్ గ్యాలెన్ల నీరు సరఫరా అవుతుండగా మరో ఏడాదిలోపు నాలుగింతలు అదనంగా 30 మిలియన్ గ్యాలెన్ల నీటిని,  ప్రతి ఇంటికి రోజుకు 135 లీటర్ల సురక్షిత నీటిని అందజేస్తామన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని, పరిశ్రమలు తరిలిపోతాయని కొందరు దుష్రచారం చేసి భయాలు, అనుమానాలు, అపోహలు సృష్టించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని పటాపంచలు చేస్తూ నిరంతరం విద్యుత్ ఇస్తున్నారన్నారు. దేశంలోనే నాణ్యమైన నీటిని సరఫరా చేస్తున్న వాటర్ వర్క్స్ సిబ్బందికి ఐఎస్‌ఓ సర్టిఫికేట్ రావడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
