
సతతం.. హరితం
హరితహారం.. మెతుకుసీమకు మణిహారంగా మారాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు...
- వృక్ష సంపదలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
- గత పాలకుల వైఫల్యాల వల్లే కరువు, కాటకాలు
- మొక్కల పెంపకం.. కేసీఆర్ ఆలోచనే..
- మంత్రి హరీశ్‌రావు వెల్లడి
మెదక్ రూరల్: హరితహారం.. మెతుకుసీమకు మణిహారంగా మారాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. పథకాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. శుక్రవారం ఆయన చిన్నశంకరంపేట, మెదక్ మండలం, పాపన్నపేట మండలాల్లో పర్యటించి మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యాల వల్లే రాష్ట్రంలో కరువు, కాటకాలు ఏర్పడ్డాయన్నారు. భవిష్యత్తు కోసం కేసీఆర్ హరితహారం పథకం ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. మొదటి విడతగా జిల్లాలో 3.52కోట్ల మొక్కలను నాటుతున్నట్టు తెలిపారు. ఇందులో ప్రతి గ్రామానికి 40వేల మొక్కల చొప్పున నాటాలన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులు భాగస్వాములై.. విరివిరిగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈయేడు పక్క జిల్లా అయిన ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయన్నారు. అక్కడ అడవులు ఉండటం వల్లే వర్షాలు ముందస్తుగా కురిశాయన్నారు. జిల్లాలో నేటికీ ఎక్కడా సరిగ వర్షాలు కురవక పోవడానికి కారణం అడవుల నరికివేతనే కారణమన్నారు. మొక్కలు నాటేందుకు ఉపాధి కూలీలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
మొక్కల పెంపకం కోసం కలెక్టర్‌తోపాటు అధికార యంత్రాంగం ఒకరోజు వేతనం ఇచ్చారని, దీంతో డిప్యూటీ స్పీకర్‌తోపాటు తాముసైతం ఒకనెల వేతనం ఇచ్చామన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో మొదటి మొక్కను చిన్నశంకరంపేట అమర వీరుల స్థూపం వద్ద నాటడం మరిచిపోలేని జ్ఞాపకమన్నారు. అనంతరం మెదక్ మండలం మాచవరం ఎంఎన్ కెనాల్ ప్రాంతాల్లో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, డీఎఫ్‌ఓ శివాని డోగ్రె, ఆర్డీఓ మెంచు నగేష్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్ తదితరులుపాల్గొన్నారు.
కెనాల్ పనుల నాణ్యతపై మండిపాటు
మెదక్ రూరల్: మెదక్ మండలం మహబూబ్‌నహర్(ఎంఎన్) కెనాల్ పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఓ చోట సిమెంట్‌కు పగుళ్లు రావటంతో ఇదేమిటని ఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇరిగేషన్ ఈఈ ఏసయ్య బదులిస్తూ వర్షాలు కురవడంతో పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. ఆయనతో పాటు డిప్యూటి స్పీకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులున్నారు.
చెర్మన్ నల్లగుడ్డలతో నిరసన
చిన్నశంకరంపేట: హరితహారం పథకం పైలాన్ ప్రారంభించే కార్యక్రమంలో శిలాఫలకంపై తన పేరు పెట్టలేదని చిన్నశంకరంపేట సహకార సంఘం అధ్యక్షుడు కె.సత్యనారాయణరెడ్డి నల్లగుడ్డలతో మంత్రి హరీశ్‌రావు కార్యక్రమానికి హాజరయ్యారు. విషయం గ్రహించిన పోలీస్‌లు వారిని అడ్డకున్నారు. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ తన పేరును కావాలనే శిలాఫలకంపై పెట్టడంలేదని ఆరోపించారు.
అటవీశాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం
పాపన్నపేట: ‘ఇరవై మంది అధికారులున్నారు. మొక్కలు నాటేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. కాని మొరం పోసిన గుంతలో మొక్కను నాటేందుకు మీకు మంత్రి కావాలా?’ అంటూ అటవీశాఖ అధికారులపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపన్నపేట మండలం ఏడుపాయల్లో శుక్రవారం మంత్రి హరీశ్‌రావు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే చెలెమెల కుంట వద్ద మంత్రి చేత ఓ మొక్కను నాటించేందుకు ఏర్పాటు చేశారు. కాని ఆ గుంతలో మొరం వేయడం చూసిన మంత్రి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్‌పై ఫైర్ అయ్యారు. మొరంతో మొక్క ఎలా బతుకుతుందంటూ ప్రశ్నించారు. ఇందుకోసం ఇంత పెద్ద ఏర్పాట్లు చేయాలా? అంటూ నిలదీశారు. దీంతో అటవీశాఖ అధికారులు ఖంగుతిన్నారు.
దుర్గమ్మకు మంత్రి పూజలు
ఏడుపాయల దుర్గమ్మకు మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ వెంకట కిషన్‌రావు, డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్, ఇన్‌స్పెక్టర్ శివరాజ్‌లు వారికి స్వాగతం పలికి, సన్మానించారు. అనంతరం లక్ష్మినగర్‌లో సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి మొక్కలు నాటారు.