ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా .. | Mike Sets For Announcement | Sakshi
Sakshi News home page

ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా ..

Aug 23 2018 10:52 AM | Updated on Aug 23 2018 10:52 AM

Mike Sets For Announcement - Sakshi

పోతారెడ్డిపేటలో అమర్చిన మైక్‌ సెట్‌

దుబ్బాకరూరల్‌ : ‘ఇందుమూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా...’ అని దండోరా ద్వారా పంచాయతీలో జరిగే కార్యక్రమాలను తెలియజేసేవారు. అయితే, ఇప్పుడా దండోరా మూగపోనుంది. దుబ్బాక మండలం పోతారెడ్డిపేట, తాళ్లపల్లి గ్రామాలు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తులకు పంచాయతీ తరపున ఏదైనా సమాచారం చేరవేయాలంటే మైక్‌సెట్‌లను వినియోగిస్తున్నారు.

గ్రామంలో ప్రతి ఒక్కరికీ వినిపించేందుకు ప్రతి వీధి, వాడలో మైక్‌సెలను  ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర సమాచారం తెలిజేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఒక్క రోజు ముందుగానే గ్రామస్తులకు విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. ఇలా ప్రచారం చేసేందుకు విలేజ్‌ హెల్పర్‌ను నియమించారు. 

పోతారెడ్డిపేటలో..

గ్రామస్తులకు సమచారాన్ని తెలియజేసేందుకు 30 మైక్‌సౌండ్‌లు ఏర్పాటుచేశారు. గ్రామంలో ఉన్న 10 వార్డుల్లో వీటిని అమర్చారు. ప్రచారం చేయడానికి ప్రత్యేకించి విలేజ్‌ హెల్పర్‌ను నియమించారు. గ్రామంలో మొత్తం జనాభా 3500 ఉండగా.. ఓటర్లు 2100, ఇళ్లు 1000, కుటుంబాలు దాదాపు 1,600 ఉన్నాయి.

తాళ్లపల్లిలో..

గ్రామంలో మొత్తం 8 వార్డులు ఉన్నాయి. జనాభా 1000, ఇళ్లు దాదాపు 150, కుటుంబాలు 200 ఉండగా మైక్‌సౌండ్‌లు 15 ఏర్పాటుచేశారు. మా ఊరిలోనూ..
ఊరి ప్రజలకు ఏదైనా సమాచారం తెలియజేయాలంటే ప్రతిసారి దం డోర వేసేవాళ్లం. రెండు నెలల నుంచి ప్రతి వీధి, వాడకు 30 వరకు మైక్‌సౌండ్‌లు ఏర్పాటు చేశాం. ఇందుకోసం ప్రత్యేకించి విలేజ్‌ హెల్పర్‌ని నియమించాం.   – చింతల జ్యోతి, మాజీ సర్పంచ్, పోతారెడ్డిపేట

అందరికీ తెలుస్తోంది

మా ఊరిలో 12 మైక్‌సౌండ్‌లు ఏర్పాటు చేశాం. ఏదైనా సమాచారం తెలియాలంటే మైక్‌తో చెప్పడం వలన అందరికీ వెంటనే తెలుస్తుంది. డప్పుతో దండోరా వేయిస్తే కొంత మందికి తెలిసేది కాదు. మైక్‌తో ప్రచారం సులువుగా మారింది. 

– శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు, తాళ్లపల్లి

ఒక్క రోజు ముందుగా..

మా గ్రామంలో ఏదైనా సమాచారం ఉంటే నేనే మైక్‌ ద్వారా ప్రచారం చేసి చెబుతా. ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర సమస్యలు ఏవైనా మైక్‌ ద్వారానే ప్రచారం చేస్తా. ఒక్క రోజు ముందుగానే ఉదయం, సాయంత్రం ప్రచారం చేస్తా. – కాసి సుధాకర్, విలేజ్‌ హెల్పర్, పోతారెడ్డిపేట

మైక్‌తో స్పష్టంగా..

ప్రతి వీధిలో మైక్‌లు బిగించిండ్రు. మైక్‌ ద్వారా సమాచారం చెప్పడం వల్ల మా ఇంటి దాకా వినబడుతంది. మా ఇంటి దగ్గర కూడా మైక్‌ సౌండ్‌ బిగించిండ్రు. గ్రామంలో ఎక్కడ ఉన్నా మైక్‌ ద్వారా చెబుతుండటంతో స్పష్టంగా వినబడుతుంది. 

– ఉప్పరి రాములు, గ్రామస్తుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement