తుది కసరత్తు

Medak Voters Final List Is Ready - Sakshi

సాక్షి, మెదక్‌:  జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నికల నోటిపికేషన్‌ ఎప్పుడు విడుదలైనా ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఓటరు తుది జాబితా రూపకల్పనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. తుది ఓటరు జాబితా ప్రకటనకు ఇంకా వారం రోజుల సమయం మిగిలి ఉంది. దీంతో ఎన్నికల సిబ్బంది ఓటరు దరఖాస్తు ఫారాలను పరిశీలన వేగవంతం చేశారు. నియోజకవర్గాల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరో పక్క ఈవీఎంల వినియోగంపైనా రాజకీయపార్టీలు, అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాలో ఈ రెండు ప్రక్రియలు శరవేగంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లోని ప్రజలకు ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించటంతోపాటు మాక్‌ పోలింగ్‌ చేపడుతున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు  మెదక్, నర్సాపూర్‌లోని 538 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో అధికార యంత్రాంగం ఈవీఎంలపై పూర్తిగా అవగాహన కల్పించనున్నారు. అలాగే ఓటర్లతో మాక్‌పోలింగ్‌ కూడా నిర్వహించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలపైనా అధికారులు దృష్టి సారించారు.  కరెంటు, తాగునీరు, టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
 
త్వరలో పార్టీలతో సమావేశం
జిల్లాలోని మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో మొత్తం 538 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వందకుపైగా పోలింగ్‌ కేంద్రాల్లో కరెంటు, తాగునీరు, టాయిలెట్ల సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభించారు. 231 పోలింగ్‌  కేంద్రాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు. అలాగే మొబైల్‌ఫోన్‌లు పనిచేయని గ్రామాలు 30 ఉన్నట్లు గుర్తించారు. ఆయా చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎన్నికల నోడల్‌ అధికారి నగేశ్‌ ఎప్పటికప్పుడు ఈ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. త్వరలో రాజకీయ పార్టీలతో అధికారులు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తుది ఓటరు జాబితా, ఈవీఎంలపై అవగాహన తదితర అంశాలపై చర్చించనున్నారు. 

 30 నుంచి 39 వయస్సు ఓటర్లే ఎక్కువ
జిల్లాలో 30–39 వయస్సు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో వారి తీర్పు కీలకం కానుంది.  జిల్లాలో మొత్తం 3,71,373 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 30–39 ఏళ్లు వయస్సు ఉన్న ఓటర్లు 1,13,921 మంది ఉన్నారు. మెదక్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,82,464 మంది, నర్సాపూర్‌ నియోజకవర్గంలో 1,88,909 మంది ఉండగా కొత్తగా నమోదైన ఓటర్లలో ఎంతమంది కలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా  ఓటరు జాబితా సవరణ కోసం 54,731 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సవరణలు చేసినవి 15,333.  సవరణలు చేపట్టాల్సిన దరఖాస్తులు 39,398. తుది ఓటరు జాబితా నాటికి ఓటర్ల సంఖ్య స్వల్పంగా మారనుంది. రాబోయే ఎన్నికల్లో యువ, మధ్య వయస్సు ఓటర్ల తీర్పు కీలకం కానుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top