రాష్ట్ర విభజన నేపథ్యంలో అపాయింటెడ్ డేగా జూన్ 2నికాకుం డా మే 16ని ప్రకటింపచేసుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది.
హైకోర్టులో నేడు టీఆర్‌ఎస్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అపాయింటెడ్ డేగా జూన్ 2నికాకుం డా మే 16ని ప్రకటింపచేసుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 16న వెలువడుతున్నందున, ఆ రోజునే అపాయింటెడ్ డేని ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరనుంది.
టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి జి. జగదీష్‌రెడ్డి మంగళవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నారు. ఈ పిటిషన్‌ను సోమవారమే హౌజ్ మోషన్ రూపంలో దాఖలు చేసేందుకు ప్రయత్నించగా.. అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల నేపథ్యంలో మంగళవారం ఎలాగూ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు. దీంతో ఆ రోజున రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 8న విచారించనుంది.