టెక్నాలజీ బాగుంది

Maharashtra DGP Dattatray Padsalgikar Visits Panjagutta Police Station - Sakshi

పంజాగుట్ట స్టేషన్‌ను సందర్శించిన మహారాష్ట్ర డీజీపీ

హైదరాబాద్‌: కేసుల ఛేదనలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పంజాగుట్ట పోలీసులు ముందుకు వెళ్తున్న తీరు భేషుగ్గా ఉందని మహారాష్ట్ర డీజీపీ దత్తాత్రేయ పదసాల్‌గీకర్‌ కితాబిచ్చారు. దేశంలోనే రెండవ ఉత్తమ పోలీస్‌స్టేషన్, రాష్ట్రంలో మోడల్‌ స్టేషన్‌ అయిన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆదివారం సందర్శించారు. ఆయనకు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, కమిషనర్‌ అంజనీకుమార్‌లు పోలీస్‌స్టేషన్‌లో టెక్నికల్‌ గ్రౌండ్‌లెవల్‌లో విధులు ఎలా నిర్వహిస్తున్నారనే అంశాలను వివరించారు. అనంతరం హ్యాక్‌ఐ తదితర యాప్‌ల పని తీరు, ఫైల్స్‌ మేనేజ్‌మెంట్, రిసెప్షన్‌ పని తీరు, కమాండ్‌ కంట్రోల్‌ రూం, లైబ్రరీ, జిమ్, కోర్టు రూం, లాకప్, ఇన్‌స్పెక్టర్‌ రూమ్‌లలో విధివిధానాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధానం, సీసీ కెమెరాల ఏర్పా టు, ట్యాబ్‌ ద్వారా పాతనేరస్థుల కదలికలు ఎలా గుర్తిస్తాం వంటి పలు విషయాలను దత్తాత్రేయకు అక్కడి సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ పదసాల్‌గీకర్‌ మాట్లాడుతూ.. దేశంలోనే పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను రెండవ ఉత్తమ స్టేషన్‌గా గుర్తించడం సరైనదే అని కితాబిచ్చారు. ఇక్కడ ఉన్న సిబ్బంది టెక్నాలజీ పనితీరుని ఎంతో చక్కగా వివరించారని కొనియాడారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తూ మరింత ముందుకు వెళ్లాలని సూచించారు.
 
నగరంలోనే ఎక్కువ టెక్నాలజీ: డీజీపీ 
రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నేరాలు అదుపుచేసేందుకు భారత్‌లోనే అన్ని నగరాల్లోకన్నా హైదరాబాద్‌లోనే ఎక్కువగా టెక్నాలజీ వాడుతున్నామని చెప్పారు. మనంవాడుతున్న టెక్నాలజీని గ్రౌండ్‌లెవల్‌లో ఎలా వాడుతున్నాం? అవి ఎలా పనిచేస్తున్నాయి? అనేది ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా తెలుసుకునేందుకు మహారాష్ట్ర డీజీపీ స్టేషన్‌ను సందర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top