ఆర్యసమాజ్‌ C/o ప్రేమ వివాహాలు | Sakshi
Sakshi News home page

ఆర్యసమాజ్‌ C/o ప్రేమ వివాహాలు

Published Thu, Feb 14 2019 10:11 AM

Love Marriages in Arya Samaj Special Story - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి అనగానే ప్రేమ జంటలకు టక్కున గుర్తొచ్చేది ఆర్యసమాజ్‌ మాత్రమే. పెద్దలు అంగీకరించని ఎన్నో ప్రేమ వివాహాలకు ఆర్యసమాజం వేదికగా నిలు స్తోంది. ఇక్కడ జరిగే ప్రేమ పెళ్లిళ్లకు స్నేహితులే పెళ్లిపెద్దలుగా మారి, సాక్షి సంతకాలు చేస్తున్నారు. ఈ వేదికపై ఇప్పటి వరకు లక్షకు పైగా ప్రేమ జంటలు ఒక్కటయ్యాయి. మహర్షి దయానంద సరస్వతి శిష్యుల్లో ఒకరైన స్వామి గిరిజానంద సరస్వతి సుల్తాన్‌బజార్‌లోని బడిచౌడీలో వందేళ్ల క్రితం ఆర్యసమాజాన్ని స్థాపించారు. స్వాతంత్రానికి ముందు నిజాం నిరంకుశత్వం, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన అనేక ఉద్యమాలకు ఇది వేదిగా నిలిచింది. స్వాతంత్య్రం అనంతరం హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత హిందూమత పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అనేక ప్రేమ పెళ్లిళ్లకు వేదికగా నిలిచింది. ఎలాంటి ఆడంభరాలు లేకుండా  హిందూ సంప్రదాయం ప్రకారం ప్రేమ జంటలను ఒక్కటి చేస్తోంది.

‘శుద్ధి సంస్కారం’ తర్వాతే:ఇక్కడ జరిగే పెళ్లిళ్లలో చాలా వరకు కులాంతర వివాహాలు, పెద్దలు అంగీకరించని వివాహాలే. ఒక వేళ ప్రేమికులిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారేతై.. వారిని ముందు çశుద్ధిసంస్కారం(మత మార్పిడి) చేసి, ఆ తర్వాత వారికి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేస్తున్నారు. ఇక్కడ జరిగే పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉండటంతో ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు అనేక జంటలు ఆసక్తి చూపుతున్నాయి. కేవలం ప్రేమికులే కాకుండా పెళ్లికి ఆర్థిక స్తోమత లేని పేద జంటలు ఈ వేదికపై ఒక్కటవుతుండటం గమనార్హం. ఈ వేదికపై వివాహం చేసుకున్న వారిలో అనేక మంది సంఘ సంస్కర్తలతో పాటు రాజకీయ ప్రముఖులు ఉన్నారు.

ఏటా 2 వేలకుపైగా పెళ్లిళ్లు:  దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యసమాజ్‌ శాఖల్లో ఏడాదికి సగటున 50 వేలకుపైగా వివాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని వందకుపైగా శాఖల్లో ఏటా రెండు వేల వివాహాలు జరుగుతుండటం విశేషం. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ వివాహాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావడంతో పాటు పిల్లలు కూడా ఆర్థికంగా స్థిరపడటం వల్ల ప్రేమ పెళ్లిళ్లకు వారు పెద్దగా అభ్యంతరం చెప్పక పోవడమే ఇందుకు కార ణమని ఆచార్య అమర్‌సింగ్‌ ఆర్య పేర్కొన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆర్యసమాజ్‌లు వివాదాస్పదంగా మారుతున్నాయి. పిల్లల పెళ్లి వివరాలను గోప్యంగా ఉంచుతుండటంతో పాటు తల్లిదండ్రులకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం వల్ల వారి ఆగ్రహానికి కారణమవుతున్నాయి.  

Advertisement
Advertisement