డబ్బుల కోసమే హత్య.. పట్టించిన ఫోన్‌ కాల్‌

 Killed for Money: SP Chetana - Sakshi

నారాయణ హత్య కేసును ఛేదించిన పోలీసులు 

రూ.7.26 లక్షల నగదు రికవరీ 

వివరాలు వెల్లడించిన ఎస్పీ చేతన 

నారాయణపేట: డబ్బుల కోసమే నారాయణను దారుణంగా హతమార్చారని ఎస్పీ చేతన తెలిపారు. హ్యత కేసును సీఐ సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందం కాల్‌ క్లూతో కూపీ లాగి కేవలం రెండు రోజుల్లోనే ఛేదించారన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ కార్యాలయ చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దామరగిద్ద మండలంలోని నర్సాపూర్‌కు చెందిన కొమ్మూరు నారాయణ బియ్యం వ్యాపారం చేసేవాడు. ఈ నెల 10న బియ్యం వ్యాపారానికి సంబంధించిన రూ.7.68 లక్షల డబ్బులను గుల్బర్గా నుంచి వసూలు చేసుకొని వస్తున్నారు. డబ్బులు తీసుకువస్తున్నట్లు తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు నారాయణ కదలికలను గమనిస్తూ వచ్చారు. గుర్మిట్కల్‌ చేరుకున్న నారాయణ ద్విచక్రవాహనంపై బయలుదేరి నర్సాపూర్‌కు వస్తుండగా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామ శివారులోని ఎర్రగుట్ట దగ్గర మాటు వేసిన ఇద్దరు వ్యక్తులు గండీడ్‌ మండలానికి చెందిన చించాటి వీరేశ్‌(20), నీరటి మహేశ్‌(23)లు వారి బొలెరో వాహనంతో ఢీకొట్టారు. అక్కడికక్కడే నారాయణ మృతిచెందిన విషయాన్ని గమనించి ద్విచక్రవాహనాన్ని, నారాయణ మృతదేహాన్ని తీసుకెళ్లి రోడ్డుకు వంద మీటర్ల దూరంలో ఎర్రగుట్ట దగ్గర ముళ్ల పొదాల్లో పడేసి.. డబ్బులతో పరారయ్యారు. 

కాల్‌ క్లూతో కూపీ.. 
హత్యకు గురైన నారాయణ సెల్‌ఫోన్‌తోనే నింది తులు ఓ వ్యక్తికి ఫోన్‌ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అదే చివరి కాల్‌. ఆ వ్యక్తి ఫోన్‌ కాల్‌ డాటాతో హంతకులను కేవలం రెండు రోజుల్లోనే పోలీసు బృందం పట్టుకుందని ఎస్పీ తెలిపారు. నారాయణతో తీసుకెళ్లిన డబ్బులను ఇద్దరూ చేరి సగం వాటాలుగా పంచుకున్నారని, ఆ డబ్బులను రికవరీ చేసేందుకు ఈ సమయం పట్టిందన్నారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. హత్య కేసును ఛేదించిన సీఐ సంపత్‌కుమార్, దామరగిద్ద ఎస్‌ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు భాస్కర్, భీమప్ప, హరీశ్, టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుళ్లు నరేందర్, రాంకుమార్, నాగరాజుగౌడ్, ఆంజనేయులను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top