ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌?

KCR May Extend Corona Lockdown Up To April 30 - Sakshi

నేడు కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం ప్రకటించే చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర కేబినెట్‌ ప్రత్యేక సమావేశం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన జరుగుతుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించే అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు ప్రకటన చేసే అవకాశముంది. ఏప్రిల్‌ 14తో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ ముగియనుండగా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరో రెండు వారాలు పొడిగించే అవకాశముంది.

ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు ఈ సమావేశం అనంతరం సీఎం ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గ భేటీలో ఆర్థిక పరిస్థితులు – భవిష్యత్‌ వ్యూహ రూపకల్పన, రాష్ట్రంలోని పేదలు – ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, వడగండ్ల వాన నష్టం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top