తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుల పాత్ర కీలకం కానుంది. ప్రధాన శాఖల అభివృద్ధికి సంబంధించి నివేదికలు రూపొందించే బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వారికి అప్పగించారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రధాన శాఖల అభివృద్ధి కోసమే కమిటీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుల పాత్ర కీలకం కానుంది. ప్రధాన శాఖల అభివృద్ధికి సంబంధించి నివేదికలు రూపొందించే బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వారికి అప్పగించారు. ముఖ్యమంత్రి మంగళవారం ప్రభుత్వ సలహాదారులు, మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో దాదాపు నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. వ్యవసాయం, విద్య, వైద్యారోగ్యం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పురపాలక, సంక్షేమ శాఖలు ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నాయి? రాబోయే సంవత్సరాల్లో ఆ శాఖలు సాధించాల్సిన లక్ష్యాలేమిటి? అందుకు అనుసరించాల్సిన విధివిధానాల రూపకల్పన, వ్యయం, నిధుల సమీకరణ తదితర అంశాలపై సలహాదారుల నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిటీలు నివేదికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని శాఖలు పురోగమిస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు సలహాదారులకు శాఖల కేటాయింపు కూడా చేసింది. దీని ఆధారంగానే కమిటీలను ఏర్పాటు చేస్తూ నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం.