అద్వితీయం | Kaleshwaram Project Beneficial For Telangana | Sakshi
Sakshi News home page

అద్వితీయం

Aug 11 2019 2:07 AM | Updated on Aug 30 2019 8:19 PM

Kaleshwaram Project Beneficial For Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీటిని ఎత్తిపోసి మొదటి దశను విజయవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ ఎత్తిపోతలకు సిద్ధమైంది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించేలా పనులన్నీ పూర్తి చేసింది. నందిమేడారం, రామడుగు పంప్‌హౌస్‌లలో ఏడు మోటార్లకుగాను 5 మోటార్లను సిద్ధం చేయడంతోపాటు అత్యంత కీలకమైన ప్యాకేజీ–7 టన్నెల్‌ పనులను పూర్తి చేసింది. ప్యాకేజీ–8లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రామడుగు పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఆసియాలోకెల్లా పెద్దవైన బాహుబలి మోటార్లకు ఆదివారం లేదా సోమవారం నుంచి ట్రయల్‌ రన్‌ జరగనుంది. ఒకట్రెండు రోజుల్లో ట్రయల్‌ రన్‌ పూర్తి చేసి ఆ వెంటనే 3–4 రోజుల్లో పూర్తిస్థాయి ఎత్తిపోతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరై మోటార్లను ఆన్‌ చేసి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టనున్నారు. 

ఆవిష్కృతం కానున్న అద్భుతం...:
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మొదటి దశలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లి బ్యారేజీకి నీటి ఎత్తిపోతల ప్రక్రియ విజయవంతమైంది. ప్రస్తుతం పరీవాహకం నుంచి వస్తున్న ప్రవాహాలతో ఎల్లంపల్లి నుంచి నీరు దిగువకు వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి నీటిని  మిడ్‌మానేరుకు తరలించే పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆ పనులు పూర్తి చేసింది. ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్‌హౌస్‌ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే 7 మోటార్లలో ఐదింటికి ఇప్పటికే వెట్‌ రన్‌ నిర్వహించారు. రెండ్రోజుల కిందట ప్యాకేజీ–7లోని టన్నెళ్ల పనులు పూర్తి చేసి పరీక్షలు నిర్వహించారు. ఇవన్నీ సఫలం కావడంతో ప్యాకేజీ–8లోని బాహుబలి మోటార్లను పరిశీలించేలా ఫోర్‌ బేకి నీటిని వదిలారు. ప్యాకేజీ–8లోని సర్జ్‌పూల్‌ని శనివారం 227 మీటర్లకుగాను 214 మీటర్ల లెవల్‌ వరకు నింపారు. దశలవారీగా సర్జ్‌పూల్‌ను నింపుతూ లీకేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆదివారం పూర్తయితే పూర్తిస్థాయిలో సర్జ్‌పూల్‌ను నింపి ఒకటి లేదా రెండు మోటార్లకు వెట్‌ రన్‌ నిర్వహిస్తారు. 

115 మీటర్ల లోతు నుంచి నీటి ఎత్తిపోత... 
ప్యాకేజీ–8లోని ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్‌ స్టేషన్‌ను భూగర్భానికి 330 మీటర్ల దిగువన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ నిర్మించింది. 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఒక్కొక్కటీ 139 మెగావాట్ల సామర్థ్యంగల 7 మోటార్లలో ఐదింటిని సిద్ధం చేశారు. ఒక్కో మోటారు సుమారు 15 మీటర్ల ఎత్తు, వ్యాసం 22 మీటర్లు, బరువు 2,376 మెట్రిక్‌ టన్నులు ఉంటుంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తాయి.

ట్రాన్స్‌ఫార్మర్‌ బేలు, కంట్రోల్‌ రూంలు రెండు చొప్పున, బ్యాటరీ రూం, మోటార్‌ రూమ్‌ ఒక్కొక్కటి నిర్మించగా, ఎల్‌టీ ప్యానెల్స్, పంప్‌ ఫ్లోర్, కంప్రెషర్‌లు కలిపి మొత్తం 4 అంతస్తులతో నిర్మించారు. మొత్తం పనిలో 40 శాతం వాటా కింద మోటార్లు, పంపులు, యంత్ర పరికరాలు, విడిభాగాల రూపంలో బీహెచ్‌ఈఎల్‌ సరఫరా చేయగా వాటిని ప్యాకేజీ–8 వద్దకు తీసుకొచ్చాక బిగించే 60 శాతం పనిని మేఘా సంస్థ పూర్తి చేసింది. ఈ మోటార్లకు కరెంట్‌ సరఫరా చేసేందుకు 400 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేసన్‌ ఇప్పటికే సిద్ధమైంది. మోటార్ల వెట్‌ రన్‌ పూర్తయ్యాక వచ్చే వారం నుంచే పూర్తిస్థాయి ఎత్తిపోతలు చేపట్టనున్నారు. మోటార్ల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఇక్కడి నుంచి నీటిని మిడ్‌మానేరుకు ఎత్తపోసే రెండు మోటార్లను స్విచ్‌ ఆన్‌ చేయనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement