కళాభారతికి కొత్త హంగులు | Kalabharatiki new arrangements | Sakshi
Sakshi News home page

కళాభారతికి కొత్త హంగులు

Mar 21 2015 3:05 AM | Updated on Sep 2 2017 11:09 PM

కరీంనగర్‌లోని కళాభారతిని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునికీకరణకు యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు పంపించాలని...

టవర్‌సర్కిల్: కరీంనగర్‌లోని కళాభారతిని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునికీకరణకు యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు పంపించాలని మున్సిపల్ కమిషనర్‌కు ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు అధికారులు హడావుడిగా ప్రతిపాదనలు తయారు చేసే పనిలో పడ్డారు. రూ.10 కోట్లతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
 
ఆధునిక సౌకర్యాలు
 కళాభారతికి సకల హంగులు కల్పించి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిని తలపించే విధంగా చేయాలనేది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న కళాభారతి రూపురేఖలను పూర్తిగా మార్చేయనున్నారు. సెంట్రల్ ఏసీ, అత్యాధునిక సౌండ్ సిస్టం, లైటింగ్, లగ్జరీ సీటింగ్, ఉడెన్ ఫ్లోర్ విత్ కార్పెట్, డోర్స్ మార్పు, శాటిలైట్ కనెక్షన్‌తో ప్రొజెక్టర్, థియేటర్ స్క్రీన్, ముందుభాగం ఎలివేషన్, మ్యూజికల్ ఫౌంటేన్, సీలింగ్ మార్పు, ఉడెన్ ప్యానల్‌తో సైడ్‌వాల్స్, అందమైన వేదిక, రెండు డ్రెస్సింగ్ రూమ్‌లు, సెన్సార్ సౌకర్యంతో టాయిలెట్స్, ఫైర్ పరికరాలు కల్పించేందుకు అధికారులు అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేట్లతో రూపొందించిన ప్రాథమిక అంచనాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అయితే అనుభవం ఉన్న కన్సెల్టెన్సీలతో మరోమారు పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు.
 
హంగులతో ఆదరణ
ప్రస్తుతం కళాభారతి సౌకర్యాల లేమితో సతమతమవుతోంది. కార్యక్రమాలకు ప్రతికూలంగా మారింది. కేవలం ఒక్క టాయిలెట్, ఒకే ఒక్క డ్రెస్సింగ్‌రూమ్, విరిగిన చైర్లు, తిరగని ఫ్యాన్లు, వెలగని లైట్లు, ఎప్పుడు విరుగుతాయో తెలి యని స్టేజీ చెక్కలు.. ఇన్ని అసౌకర్యాల మధ్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కళాకారులకు కత్తిమీద సాముగా మారింది. దీంతో ఎవరూ కళాభారతి లో కార్యక్రమాలకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం కళాభారతి ఆధునికీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కళాకారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కార్యక్రమాల నిర్వహణ అంగరంగ వైభవంగా చేసుకోవచ్చనే ధీమా కనబరుస్తున్నా రు. కార్యక్రమాలు పెరిగితే కళాభారతికి ఆదాయం గణనీయంగా పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement