
రైళ్లలో చంటి పిల్లల ఆహారం
చంటి పిల్లలతో ప్రయాణించే వారికి శుభవార్త. ‘జననీ సేవ’ పేరుతో రైళ్లలో పిల్లల ఆహారం అందించేలా రైల్వేశాఖ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
♦ యుద్ధప్రాతిపదికన ప్రారంభమైన ‘జననీ సేవ’
♦ తొలి ప్రయత్నంగా 53 స్టేషన్లు, 32 రైళ్లలో అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: చంటి పిల్లలతో ప్రయాణించే వారికి శుభవార్త. ‘జననీ సేవ’ పేరుతో రైళ్లలో పిల్లల ఆహారం అందించేలా రైల్వేశాఖ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి అన్ని రైల్వే స్టేషన్లు, దూరప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో వేడి పాలు, వేడి నీళ్లు, సెరిలాక్, ఫ్యారెక్స్ వంటివి అందుబాటు లో ఉంటాయి. తొలి ప్రయత్నంగా 53 ప్రధాన రైల్వే స్టేషన్లు, 32 ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రారంభించారు. రైల్వే స్టేషన్లలో పాలు, టీ విక్రయించే కౌంటర్లలోనే వీటికి అనుమతించా రు. నిర్ధారిత రుసుము తీసుకుని అక్కడ వీటిని అందిస్తారు. రైళ్లలో సిబ్బందికి చెబితే సీటు వద్దకే తెచ్చిస్తారు. త్వరలో మరిన్ని స్టేషన్లు, రైళ్లలో కూడా ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్త ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించటంతో వారు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
‘జనని సేవ’ అందించే స్టేషన్లు ఇవే...
సికింద్రాబాద్ డివిజన్: సికింద్రాబాద్, నాం పల్లి, కాజేపేట, వరంగల్,ఖమ్మం,వికారాబాద్
హైదరాబాద్ డివిజన్: కాచిగూడ, గద్వాల, మహబూబ్‌నగర్, కామారెడ్డి, నిజామాబాద్, కర్నూలు
విజయవాడ డివిజన్: విజయవాడ, గూడురు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, అనకాపల్లి, గుడివాడ, తణుకు, భీమవరం, తుని, నర్సాపూర్
గుంతకల్ డివిజన్: తిరుపతి, రేణిగుంట, కడప, గుత్తి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, యాద్గిర్, అనంతపురం, ధర్మవరం, పాకాల
గుంటూరు డివిజన్: నంద్యాల, దిగువమెట్ట, గుంటూరు, నల్గొండ, నడికుడి, కంభం, మార్కాపురం, మిర్యాలగూడ
నాందెడ్ డివిజన్: నాందెడ్, పూర్ణ, పర్భణి, జాల్నా, ఔరంగాబాద్, నాగర్‌సోల్, ముద్ఖేడ్.
ఈ రైళ్లలో కూడా...
సికింద్రాబాద్-దానాపూర్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, తిరుపతి-హజ్రత్‌నిజాముద్దీన్ ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-బికనీర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్, విజయవాడ-చెన్నై పినాకిని ఎక్స్‌ప్రెస్, విజయవాడ-విశాఖపట్టణం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, నాందేడ్-అమృత్‌సర్ నాందెడ్ ఎక్స్‌ప్రెస్, నాందెడ్-ముంబై సిటీ తపోవన్ ఎక్స్‌ప్రెస్, పూర్ణ-పాట్నా పూర్ణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్.