జన గోదావరి | Jana godavari | Sakshi
Sakshi News home page

జన గోదావరి

Jul 15 2015 4:21 AM | Updated on Aug 15 2018 9:27 PM

జన గోదావరి - Sakshi

జన గోదావరి

గోదావరి మహాపుష్కల తొలిరోజు జనవాహిని ఉప్పొంగింది. ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం, మంథని, గోదావరిఖని

సాక్షి బృందం :  గోదావరి మహాపుష్కరాల తొలిరోజు జనవాహిని ఉప్పొంగింది. ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం, మంథని, గోదావరిఖని సహా జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లవద్ద భక్తులు ఊహించని సంఖ్యలో తరలివచ్చారు. పుష్కరుడి రాకతో పులకించిన గోదావరి తల్లి తొలిరోజు పెద్ద పండుగ చేసుకున్నట్లయింది. జిల్లావ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికిపైగా గోదావరి ఒడిలో స్నానమాచరించి భక్తపారవశ్యంలో మునిగిపోయారు.

 ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ధర్మపురి గోదావరినదిలో పుష్కరస్నానం ఆచరించి పుష్కరాల మహా వేడుకలను ప్రారంభించారు. పుష్కరాల్లో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఇక్కడికి చేరుకున్న కేసీఆర్ రాత్రి స్థానిక హరిత ప్లాజాలో సతీమణి, మనుమడితో కలిసి బస చేశారు. మంగళవారం పలువురు పీఠాధిపతుల ఆశీర్వచనాలు, మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఉదయం 6.21 గంటలకు గోదావరినదిలో పట్టు వస్త్రాలంకరణతో సతీసమేతంగా స్నానమాచరించి ధర్మపురిలో పుష్కరాలను ప్రారంభించారు.

పీఠాధిపతులు సచ్చిదానందస్వామి, మాధవానం దస్వామి, విద్యారణ్యభారతి, తొగుటస్వామి, రాఘవేం ద్రస్వామి, స్వరూపానందస్వామి, శ్రీశైల వీరశైవ పీఠాధిపతులు పుష్కర స్నానాలు ఆచరించిన అనం తరం సీఎం దంపతులకు ఆశీస్సులు అందజేశారు. పుష్కరస్నానం అనంతరం కేసీఆర్ ధర్మపురి నృసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటారని భావించిన అధికారులు ఆలయ పరిసరాల్లో భద్రతను పెంచారు. కానీ పుష్కరస్నానం చేసిన కేసీఆర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లకుండా గుడి బయట నుంచే మొక్కి నేరుగా హరిత ప్లాజాకు వెళ్లిపోయారు. అనంతరం ధర్మపులో పుష్కర పైలాన్ ఆవిష్కరించి తిరుగుపయనమయ్యారు. సీఎం వెంట దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి తదితరులున్నారు.

 కాళేశ్వరంలో రాష్ర్టమంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, జూపల్లి కృష్ణారావు, జగదీష్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు దంపతులు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి, గోదారమ్మకు హారతిచ్చి, పుష్కర స్నానాలు చేసి వేడుకలను ప్రారంభించారు. మిగిలిన ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పుష్కరాలను ప్రారంభించారు.

 ధర్మపురిలో మూడు లక్షల మంది...
 జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మపురిలో పుష్కర స్నానమాచరించేందుకు మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీని అంచనా వేసిన పోలీసులు ధర్మపురి నుంచి ఐదు కిలోమీటర్ల వరకున్న కరీంనగర్-జగిత్యాల రహదారిని పూర్తిగా దిగ్బంధనం చేశారు. వాహనాలను పట్టణ శివారులోనే నిలిపివేయడంతో భక్తులు కాలినడకన గోదావరికి చేరుకుని పుష్కర స్నానాలు చేశారు. సాయంత్రం వరకు మూడు లక్షల మంది పుష్కర స్నానం చేసినట్లు అధికారుల అంచనా. ఇక్కడ  కలెక్టర్ నీతూప్రసాద్, డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ జోయల్ డేవిస్ సహా ఉన్నతాధికారులు భక్తులకు ఇబ్బందులకు కలుగకుండా చర్యలు తీసుకున్నారు.

 కాళేశ్వర ంలో రెండు లక్షలకు పైగా...
 గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో తొలిరోజు రెండు లక్షల మందికి పైగా జనం తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించి, పెద్దలకు పిండప్రదానాలు చేశారు. దీంతో కాళేశ్వరం ప్రాంతమంతా జన సందోహంతో నిండిపోయింది. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులంతా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని వెనుదిరిగారు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

 జిల్లాలోని ధర్మపరి, కాళేశ్వరం, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, సారంగాపూర్ మండలాలతో పాటు కోలిలింగాల, రామగుండం, గోదావరిఖని, సుందిళ్ల, మంథని సహా గోదావరి నది వెంట మొత్తం 39 ఘాట్లను ఏర్పాటు చేయగా, తొలిరోజు సుమారు 10 లక్షల మంది స్నానమాచరించినట్లు జిల్లా అధికారుల అంచనా వేశారు. ధర్మపురిలో అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, జెడ్పీ చైర్‌పర్సన్, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు వి.సతీష్‌కుమార్, గంగుల కమలాకర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పుష్కర స్నానాలు ఆచరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement