మాటలు చెప్పొద్దు | irrigation projects Construction Officers words | Sakshi
Sakshi News home page

మాటలు చెప్పొద్దు

Jul 22 2015 1:32 AM | Updated on Sep 3 2017 5:54 AM

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అధికారులు మాటలు చెప్పొద్దని, చేతలు చేసి చూపించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ
 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అధికారులు మాటలు చెప్పొద్దని, చేతలు చేసి చూపించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు. ‘ మీరు గత ప్రభుత్వాల హయాంలో చేసిన పని చేయవద్దు.. కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసం మా ప్రభుత్వం పనిచేయడం లేదు.. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో చేపట్టిన సాగు, తాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాల్సిందే.’ అని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో పాటు పలువురు నీటిపారుదల, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
 
  ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కేవలం ప్రతిపాదనలు హైదరాబాద్‌కు పంపి మా పని అయిపోయిందని చేతులు దులుపుకోవద్దని, ఆ ప్రతిపాదనలు ఫాలోఅప్ చేసి పని పూర్తయ్యేంతవరకు పనిచేయాలని ఆయన సూచించారు. జిల్లాలోని పలు ప్రాజెక్టుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మరింత కష్టపడి అధికారులు పనిచేయాలన్నారు. ఇక, డిండి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రత్యేక సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, అదే విధంగా డిండి, పెండ్లిపాకల ప్రాజెక్టుల నిర్మాణానికి గాను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో రెండు భూసేకరణ యూనిట్లు మంజూరు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అదే విధంగా కనగల్, ఎడవెల్లి చెరువుల్లో ఎక్కువ కాలం నీళ్లుండేలా చర్యలు తీసుకోవాలని, ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ ద్వారా ఈ చెరువులకు నీళ్లందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
 
  ఇక గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పనులను ప్రారంభించి, అదనపు నిధులు మంజూరు చేసిన నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చందుపట్ల చెరువు పనులు ఎందుకు పూర్తికాలేదని అధికారులను ప్రశ్నించగా, కాంట్రాక్టర్ పనులు చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని అధికారులు చెప్పినట్టు సమాచారం. దీంతో సదరు కాంట్రాక్టర్‌కు పనులు చేయడం ఇష్టం లేకపోతే 60(ఏ) నిబంధన కింద ఆయనను తప్పించి వేరే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించయినా చందుపట్ల చెరువు పూడికతీత పనులు పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
 
 సాగర్ బిల్లులు వారికిచ్చేయండి
 ఇక, సాగర్ ఆధునికీకరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి హరీశ్‌రావు ఎన్నెస్పీ కింద చెల్లిస్తున్న విద్యుత్‌బిల్లులను తగ్గించుకోవాలని అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ నుంచి ఖమ్మం జిల్లాలోని టెయిల్‌ఎండ్ వరకు ఉన్న ఎన్నెస్పీ క్వార్టర్ల బిల్లులు ప్రాజెక్టు చెల్లించాల్సిన పనిలేదని, ప్రతి క్వార్టర్‌కు వ్యక్తిగత మీటర్లు బిగించి బిల్లుల వసూలు బాధ్యతలు ట్రాన్స్‌కోకు అప్పగించాలని ఆయన సూచించారు. ఇందుకోసం నీటిపారుదల, ట్రాన్స్‌కో అధికారులు కలిసి ముందుకెళ్లాలని, జిల్లాలో 4,000 కొత్త మీటర్లను బిగించాలని ఆదేశించారు. అదే విధంగా నాగార్జునసాగర్‌లో వీధి దీపాల నిర్వహణ బిల్లులను ప్రస్తుతానికి ప్రాజెక్టు ద్వారానే చెల్లించాలని, సాగర్ గ్రామపంచాయతీ ఏర్పాటయిన తర్వాత పంచాయతీకి అప్పగించాలని హరీశ్ సూచించారు. సమీక్షలో విప్ సునీత, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement