లెక్క తేలలేదు..

Irregularities In Voters List In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఓటర్ల లెక్క పూర్తిగా తేలలేదు. ఓటర్ల తుది జాబితా వెల్లడించినప్పటికీ కులాల వారీగా, మహిళా ఓటర్ల సంఖ్య ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలోని మిగతా మున్సిపాల్టీల్లో ఓటర్ల తుది జాబితాను కులాల వారీగా, మహిళా ఓటర్ల సంఖ్య ప్రకటించినా నగరపాలక సంస్థలో బుధవారం నాటికి వాయిదా పడింది. కరీంనగర్‌ నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం 60 డివిజన్లకు చెందిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. విడుదల చేసిన తుది ఓటర్‌ జాబితాను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. నగరంలో ఉన్న వివిధ పార్టీల కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులకు నగరపాలకసంస్థ తరఫున 60 డివిజన్ల ఓటర్ల జాబితాను అందజేశారు. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి న్యాయబద్ధమైనవి పరిష్కరించినట్లు వెల్లడించారు. 

తుది జాబితాలో పెరిగిన ఓటర్లు 18,941
కరీంనగర్‌ నగరపాలక సంస్థలో పునర్విభజన తర్వాత చేపట్టిన ఓటర్ల సర్వే ఆధారంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2,56,845 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,29,273 మంది కాగా, మహిళలు 1,27,572 మంది ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రకటించిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. తుదిజాబితా ప్రకారం ఓటర్లు 2,75,786 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితా కంటే ప్రస్తుత జాబితాలో 18,941 ఓటర్లు పెరిగారు. ముసాయిదా జాబితా తయారీ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ఎక్కడ గల్లంతయ్యాయో... సర్వే చేపట్టిన వారికే తెలియాలి. 

వెల్లడించని కుల, మహిళా ఓటర్ల సంఖ్య..
కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఓటర్ల తుది జాబితాను వెల్లడించినప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన సంఖ్యను ప్రకటించలేకపోయారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కుల, మహిళా ఓటర్ల సంఖ్యను ప్రకటించినా కరీంనగర్‌లో ప్రకటించికపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన అధికారులు, ఈ నెల 14 తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల సంఘం మరో రెండు రోజుల గడువు పెంచి 16న తుది జాబితా ప్రకటించాలని సమయం ఇచ్చినప్పటికీ అధికారులు గణన పూర్తి చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కులాల వారీగా ఓటర్ల జాబితాల్లో ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా... అంటూ విపక్ష పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తప్పుల తడకగా కులాల గుర్తింపు...
నగరపాలక సంస్థలో పలు డివిజన్లలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుల గణన సమయంలో ఇష్టం వచ్చినట్లు ఒక కులం వారికి మరో కులంగా గుర్తించారు. నగరంలోని 3–7–188/1 ఇంటిలో రెడ్డి కులానికి చెందిన రాజిరెడ్డి కుటుంబంలోని ఓటర్లను ఎస్సీలుగా లెక్కించారు. ఇది ఒక్క ప్రాంతంలోనే కాదు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.  

రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠ..
ఓటర్ల జాబితాలో కుల గణనను వెల్లడించికపోవడంతో రిజర్వేషన్లపై ఉత్కంఠ వీడడం లేదు. కుల గణనను ప్రకటిస్తే ఆ లెక్క ప్రకారం రిజర్వేషన్లను లెక్కించుకునే అవకాశం ఉండేది. అధికారులు కుల గణనను ప్రకటించకపోవడంతో రిజర్వేషన్లపై సందిగ్ధం నెలకొంది. ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి. ఏ డివిజన్‌ ఏ వర్గానికి రిజర్వ్‌ అవుతుందనే ఎవరూ తేల్చలేని పరిస్థితి నెలకొంది. కుల గణన ప్రకటిస్తే తప్ప రిజర్వేషన్లపై ఉత్కంఠత వీడే అవకాశం లేదు.

మున్సిపాల్టీల వారీగా..
► చొప్పదండి మున్సిపాల్టీలో మొత్తం 12,554 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,253, మహిళలు 6,301 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 48 మంది అధికంగా ఉండడం గమనార్హం. కొత్త మున్సిపల్‌ చట్టంపై చట్టసభల్లో ఆమోదం పొందాకే రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశం ఉండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
►  కొత్తపల్లి మున్సిపాల్టీ తుది ఓటరు జాబితాను మంగళవారం విడుదల చేశారు. కమిషనర్‌ గాలిపల్లి స్వరూపారాణి, టీపీఓ శ్రీహరి తదితరులు తుది ఓటరు జాబితాను ప్రదర్శించారు. 12 వార్డులకు గాను 9,421 మంది ఫొటోలతో కూడిన ఓటరు జాబితా విడుదల చేశారు. 117 ఓట్లు డబుల్‌గా నమోదైనట్లు వచ్చిన అభ్యర్థనలను తదుపరి చర్యల నిమిత్తం ఆర్డీఓకు నివేదించారు.  
► జమ్మికుంట పురపాలక సంఘం ఓటర్ల తుది జాబితా వెలువడింది. కమిషనర్‌ అనిసూర్‌ రషీద్‌ ఓటర్ల జాబితాను మంగళవారం విడుదల చేశారు. మొత్తం 29,087 ఓటర్లుండగా.. ఇందులో 14,596 మంది మహిళలు, 14,491 పురుషులు ఉన్నట్లు వెల్లడించారు. బీసీలు 18,920, ఎస్సీలు 5,704, ఎస్టీలు 210, ఓసీలు 4,253 ఉన్నట్లు వివరించారు. 
► హుజూరాబాద్‌ పట్టణంలోని 30 వార్డులకు సంబంధించిన ఓటరు తుది జాబితాను మున్సిపల్‌ కమిషనర్‌ ఈసంపల్లి జోనా విడుదల చేశారు. మొత్తం ఓటర్లు 25,406 మంది ఉండగా.. పురుషులు 12,659, మహిళా ఓటర్లు 12,747 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ ఓటర్లు 234, ఎస్సీలు 4,583, బీసీలు 16,305, ఓసీ ఓటర్లు 4,284 మంది ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top