వియ్యాలవారి విందు.. ఓహొహో మనకే ముందు!

international sweet festival in hyderabad - Sakshi

పరేడ్‌ గ్రౌండ్స్‌లో నోరూరిస్తున్న అంతర్జాతీయ స్వీట్‌ ఫెస్టివల్‌

మిఠాయిల పండుగను ప్రారంభించిన మంత్రి చందూలాల్, స్పీకర్‌ మధుసూదనాచారి 

రుచులు, కళలపై ప్రభుత్వానిది ప్రత్యేక ముద్ర: స్పీకర్‌  

ఒకేచోట పలు దేశాలు, రాష్ట్రాలకు చెందిన వెయ్యికిపైగా స్వీట్లు

సాక్షి, హైదరాబాద్‌: 78 రకాల లడ్డూలు.. 66 రకాల హల్వాలు.. 74 రకాల పాయసాలు.. మరెన్నో రకాల స్వీట్లు నగరవాసుల నోరూరించాయి. దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ శనివారం ఉదయం పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. మూడు రోజులపాటు సాగే ఈ ఫెస్టివల్‌ను సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, శాసనసభ స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారి ప్రారంభించారు. మిఠాయిల పండుగలో వెయ్యికి పైగా స్వీట్లను ప్రదర్శించారు. కాకినాడ కాజా, బందరు లడ్డూలు, పలురకాల పాయసాలు, 220 రకాల డ్రై ఐటమ్స్, 446 రకాల సెమీ లిక్విడ్‌ హల్వాలు, 60 రకాల జ్యూస్‌లు, పానకాలు ఘుమఘుమలాడాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీలు, బెంగాలీలు, రాజస్తానీలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక అసోసియేషన్స్‌ తమ సంప్రదాయ మిఠాయిలను ప్రదర్శనకు తీసుకువ చ్చాయి. వీటి కోసం 720 విక్రయశాలలు ఏర్పాటు చేశారు. అలాగే 12 అంతర్జాతీయ స్టాల్స్‌ను ఉంచారు. తొలిరోజు ఫెస్టివల్‌ను సందర్శించిన 25 వేల మందికిపైగా ప్రజలు.. అద్భుతం.. అమోఘం అంటూ లొట్టలేస్తూ మిఠాయిలు లాగించేశారు.

రుచులు, కళలపై ప్రత్యేక ముద్ర
రుచులు, కళలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ముద్రను వేస్తూ ముందుకు సాగుతోందని స్పీకర్‌ మధుసూదనాచారి పేర్కొన్నారు. మిఠాయిలు ఓ ప్రాంతానికి పరిమితం కావని, భాగ్యనగరం కూడా అందరికీ చెందినదని చెప్పారు. ప్రపంచంలో ఇంత వరకు ఎక్కడా జరగని మిఠాయిల పండుగకు హైదరాబాద్‌ వేదిక కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. నగరవాసుల జీవితాల్లో ఈ స్వీట్‌ ఫెస్టివల్‌ ఒక మధురానుభూతిగా మిగిలిపోతుందని చెప్పారు. మంత్రి చందూలాల్‌ మాట్లాడుతూ.. 15 దేశాలు, 25 రాష్ట్రాలకు చెందిన వెయ్యి రకాల మిఠాయిలను ఒకే చోట చూసే, తినే అవకాశం రావడం అద్భుతమేనని చెప్పారు. శాసనమండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ వివిధ దేశాల వారి కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్వీట్‌ స్టాల్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్వీట్‌ ఫెస్టివల్‌ వైస్‌ చైర్మన్‌ మామిడి హరికృష్ణ, ఈవెంట్స్‌ కన్వీనర్‌ అభిజిత్, టూరిజం కమిషనర్‌ సునీత భగవత్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top