రైతులందరికీ బీమా వర్తింపజేయాలి

Insurance should be applied to all farmers says CM KCR - Sakshi

     అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

     అందరి పేర్లూ నమోదు చేయాలి

     అప్పటివరకు నామినీ దరఖాస్తుల స్వీకరణ

     పాస్‌పుస్తకాల్లో తప్పులను సరిచేయాలి

     పేర్ల మార్పిడిని వేగంగా పూర్తి చేయాలి

     రైతు బీమా, భూ రికార్డుల ప్రక్షాళనపై సమీక్ష  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు జీవిత బీమాను వర్తింపజేసేందుకు వ్యవసాయ అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రైతులందరి పేర్లు నమోదయ్యే వరకు నామిని దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం కొనసాగించాలని సూచించారు. ఇప్పటివరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల్లో దొర్లిన తప్పులను సవరించడం, పేరు మార్పిడి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. రైతు బీమా పథకం, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘రైతు బీమా పథకం కోసం రైతులందరి పేర్లు నమోదు చేయాలి. రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా, ఎన్ని ఖాతాలున్నా ఒక రైతుకు ఒక పాలసీ మాత్రమే వర్తిస్తుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న ప్రతి రైతు పేరునూ నమోదు చేయాలి. నామినీ దరఖాస్తు ఫారాలు త్వరగా ఇచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలి. ఇప్పటివరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి అందిస్తే మొదటి విడత బీమా ప్రీమియం సొమ్ము చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన జరిగిన తర్వాత కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చాం. రైతు బంధు పథకం కింద చెక్కులు ఇచ్చాం. కొందరు రైతులకు ఇంకా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందలేదు. కొన్ని పాస్‌పుస్తకాల్లో తప్పులు సవరించాల్సి ఉంది. పేరు మార్పిడి ప్రక్రియలో కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేశాం. అనుకున్నంత వేగంగా పని జరగడం లేదు. వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ముందు రికార్డులన్నింటినీ మ్యాన్యువల్‌గా సరి చేసుకోవాలి’’అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, లోక్‌సభ సభ్యుడు వినోద్‌ కుమార్, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు ఎస్‌. నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, శాంతకుమారి, సీఎంవో అధికారులు స్మిత సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంకా వర్గీస్, వ్యవసాయశాఖ కమిషనర్‌ జగన్‌మోహన్‌ పాల్గొన్నారు.

2.13 లక్షల మందికి సబ్సిడీ బర్రెలు... 
పాడిపరిశ్రమ సంఘాల సభ్యులకు సబ్సిడీ పై బర్రెలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ సొసైటీలకు చెందిన 2.13 లక్షల మంది పాడి రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. ఒక్కో యూనిట్‌కు రూ. 80 వేలు కేటాయించాలని, రూ. 5 వేల వరకు అదనంగా రవాణా ఖర్చుల కోసం ఇవ్వాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, ఇ తరులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఎక్కడి నుంచైనా, ఎవరి నుంచైనా పశువులను కొనుక్కునే అవకాశం రైతులకు కల్పించాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top