సాగర్‌ @202 టీఎంసీలు | Sakshi
Sakshi News home page

సాగర్‌ @202 టీఎంసీలు

Published Mon, Aug 12 2019 2:58 AM

Inflow above 6 lakh cusecs into the project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎగువన కృష్ణా, భీమా, తుంగభద్ర నదులు ఉప్పొంగుతుండటంతో రాష్ట్రంలోని కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. జూరాల, శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలంకు వచ్చిన ఇన్‌ఫ్లోను వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదులుతుండటంతో నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి గంటగంటకు పెరుగుతోంది. దీంతో సాగర్‌లో శనివారం నీటి నిల్వ 162 టీఎంసీలుగా ఉండగా.. అది ఆదివారం రాత్రికి 202 టీఎంసీలకు చేరింది. వరద ఉధృతి 8.60 లక్షల క్యూసెక్కులకు పెరిగే అంచనాల నేపథ్యంలో రెండ్రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. 

నిండేందుకు రెండు, మూడ్రోజులే! 
మహారాష్ట్రలో నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో కృష్ణా బేసిన్‌లోని చిన్నచిన్న వాగులు, ఉపనదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్‌లకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ నీరంతా దిగువ జూరాలకు వస్తోంది. జూరాల నుంచి శ్రీశైలానికి.. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు పెద్దెత్తున ప్రవాహం వస్తోంది. ఆయా ప్రాజెక్టుల పరిధిలో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క జూరాలకు ఎగువన భీమానదిపై ఉన్న మహారాష్ట్రలోని ఉజ్జయినీ జలాశయానికి ప్రవాహాలు పోటెత్తుతున్నాయి. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీలకు నిల్వ 202 టీఎంసీలకు చేరింది.

ఆదివారం ఒక్క రోజే 40 టీఎంసీల మేర కొత్తనీరొచ్చి చేరింది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల అవసరాలకు, విద్యుదుత్పత్తి ద్వారా 38,016 క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. సోమవారం నుంచి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో ప్రాజెక్టు రెండు, మూడు రోజుల్లోనే పూర్తి స్థాయి మట్టాలకు చేరుకోనుంది. ఇక గోదావరిలోని ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు క్రమంగా తగ్గుతున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement