జిల్లాలో రోజురోజుకూ బాలికల నిష్పత్తి పూర్తిగా పడిపోతోంది. ఆడపిల్ల అని తేలితే గర్భంలోనే అంతమొందిస్తున్నారు.
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో రోజురోజుకూ బాలికల నిష్పత్తి పూర్తిగా పడిపోతోంది. ఆడపిల్ల అని తేలితే గర్భంలోనే అంతమొందిస్తున్నారు. స్కానింగ్ సెంటర్లపై జిల్లా యంత్రాంగం నిఘా ఏర్పాటు చేసినా లింగనిర్ధారణ పరీక్షలు గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. కొందరు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు మొబైల్ స్కానింగ్‌సెంటర్లు నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా తిరిగి పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 110కి పైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
పతి గర్భిణీకి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి డబ్బులు దండుకోవడంతో పాటు ఆడ, మగ అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలితే వెంటనే అబార్షన్లను చేయిస్తున్నారు. దీని కారణంగా జిల్లాలోని ఒక్క మోత్కూరు మండలం మినహా మిగతా 58 మండలాలలో ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. జిల్లాలో సగటున 0నుంచి 6 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన ప్రతి వెయ్యి మంది బాలురకు 921మంది బాలికలే ఉన్నారు.
మోత్కూరు మండలంలో మాత్రం 2001లో వెయ్యిమంది బాలురకు 954మంది బాలికలు ఉండగా, 2011నాటికి వారి సంఖ్య వెయ్యికి చేరింది. దీంతో మండలంలో బాలురు, బాలికల నిష్పత్తి సమానంగా ఉంది. ముఖ్యంగా సంస్థాన్ నారాయణపురం, చందంపేట, మునుగోడు, పెద్దవూర, త్రిపురారం, భువనగిరి, మర్రిగూడ, పోచంపల్లి, చిట్యాల, ఆత్మకూరు(ఎం), చండూరు, వలిగొండ, తుంగతుర్తి, నూతన్‌కల్ మండలాల్లో గణనీయంగా ఆడపిల్లల నిష్పత్తి పడిపోయింది. దీనికి కారణం జిల్లాలో గర్ధస్త పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయకపొవడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన నిర్వాహకులు, చేయించుకున్న వారితో పాటు వారిని ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులే.
జిల్లా వ్యాప్తంగా ఉన్నస్కానింగ్ సెంటర్లు, ఇతర జిల్లాల నుంచి వచ్చే మొబైల్ స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పుడే బాలికల నిష్పత్తి పెరిగే అవకాశం ఉంది. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చిరంజీవులు ఆడపిల్లల నిష్పత్తి పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. స్కానింగ్ సెంటర్లపై నిఘాలను పెంచాలని ఆదేశించి సంబంధిత అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా, అధికారుల్లో ఎలాంటి చలనం ఉంటుందో వేచి చూడాల్సిందే.