ట్రీపుల్‌ ఐటీ పిలుస్తోం‍ది

IIIT Intermediate Admissions Basara Telangana - Sakshi

నేటి నుంచి  ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

జూన్‌ 31 వరకు ధ్రువీకరణపత్రాల పరిశీలన

పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు సువర్ణావకాశం

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌:  పదో తరగతి పూర్తి కాగానే విద్యార్థులు, తల్లిదండ్రులు భవిష్యత్‌ బంగారమయ్యే దారులవైపు కలలు కంటుంటారు. ఇందులో బాసర ట్రీపుల్‌ ఐటీ ఒకటి. ప్రభుత్వ సంస్థల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాధాన్యతనివ్వడంతో అధికశాతం విద్యార్థులు ట్రీపుల్‌ఐటీ వైపు దృష్టిపెడుతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. విద్యార్థుల తలిదండ్రులు ట్రీపుల్‌ ఐటీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయపడుతుంటారు. చిన్న పొరపాట్లతో చేజేతులార సీట్లు కోల్పోవడం చూస్తునే ఉంటాం. ఈ సందర్భంగా ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోనే విధానం ‘సాక్షి’ మీకోసం అందిస్తోంది.

వసతులు..

విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాలతోపాటు రెండు జతల యూనిఫాం, షూలు, ల్యాప్‌టాప్‌లు తదితర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రిపుల్‌ఐటీ అధికారులు కోరారు.

జత చేయాల్సిన పత్రాలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, పదో తరగతి హాల్‌ టికెట్, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణపత్రాలు, వికంలాగులైతే వైకల్య ధ్రువీకరణపత్రం, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణపత్రం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి. 

ఫీజుల వివరాలు..

రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఏడాది రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సి అవసరం లేదు.

  •      రిజిష్టేషన్‌ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
  •      క్యాష్‌ డిపాజిట్‌ కింద ఏ కేటగిరీ అభ్యర్థులైనా 2000 చెల్లించాలి. (దీనిని తిరిగి ఇస్తారు).
  •     ఇతర రాష్ట్రాల, గల్ఫ్‌ దేశాల్లో పనిచేసే వారి పిల్లలు ఏడాదికి రూ.1.36 ల„ýక్షలు,  ఎన్నారై విద్యార్థులు రూ.3 లక్షల ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి .

అర్హతలు..

  • అభ్యర్థులు ప్రథమ ప్రయత్నంలో 2019–ఎస్‌ఎస్‌సీ, తత్సామాన పరీక్షల్లో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. 2019 డిసెంబర్‌ 31 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు.

దరఖాస్తు విధానం..

  • అభ్యర్థులు ఈ–సేవా లేదా మీ–సేవా కేంద్రాల ద్వారా ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో     దరఖాస్తు చేసుకోవాలి
  • ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.
  • దరఖాస్తు ఫీజుతోపాటు సర్వీసు చార్జి కింద ఆన్‌లైన్‌లో అదనంగా రూ.25 చెల్లించాలి.

అడ్మిషన్ల పద్ధతి..

పదో తరగతిలో గ్రేడ్‌ పాయింట్‌ ఏవరేజ్‌ (జీపీఏ) ఆధారంగా మెరిట్‌ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఒకే జీపీఏ ఉన్న అభ్యర్థులకు సబ్జెక్టు వారీగా పొందిన గ్రేడ్‌ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రివేషన్‌ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. మోడల్, బాలికల, బాలుర పాఠశాల విద్యార్థులకు సైతం 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వేయింటేజీగా పేర్కొన్నారు.  బాసర ట్రిపుల్‌ ఐటీలో 85 శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్‌ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 371 ఆర్టికల్‌–డీ, సెక్షన్‌–95/2014 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top