ముందుకు సాగని ‘మూడో దారి’

Hyderabad People Suffering With Traffic in Malakpet Fly over Works - Sakshi

నగరంలో అనేక ప్రాంతాల్లో కొత్త మార్గాల అభివృద్ధి

ట్రాఫిక్‌ పద్మవ్యూహంగా మారిన మలక్‌పేట్‌ ప్రాంతం

రైలు వంతెన వద్ద నిత్యం  పరిస్థితులు మరీ దారుణం

మోక్షంలేని మరో అండర్‌ పాస్‌ ఏర్పాటు ప్రతిపాదనలు

‘మూసీ వెంట మార్గం’  పట్టని జీహెచ్‌ఎంసీ

సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్‌’ వ్యాప్తంగా ఎక్కడిక్కడ కొత్త మార్గాల అభివృద్ధి, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది. పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అయితే ఏళ్ళుగా మలక్‌పేట్‌ రైల్వే బ్రిడ్జ్‌ వద్ద మూడో అండర్‌ పాస్‌ కట్టాలనే ప్రతిపాదనలకు మాత్రం మోక్షం లభించట్లేదు. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులు అనునిత్యం నరకం చవి చూస్తున్నారు. సిటీ బస్సులు నడవని, ‘కరోన ఫీవర్‌’ తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లోనే ట్రాఫిక్‌ జామ్స్‌ అవుతున్నాయంటే... రేపు సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పరిస్థితి వేరుగా చెప్పక్కర్లేదు.  

‘డైనమిక్‌’గా వాడుకోవచ్చని భావించారు...
ప్రస్తుతం మలక్‌పేట రైల్‌ వంతెన వద్ద ఉన్న రెండు మార్గాలను ఒకటి చాదర్‌ఘాట్‌ వైపు, మరోటి మలక్‌పట వైపు వెళ్ళే వాహనాల కోసం వినియోగిస్తున్నారు. మూడో మార్గం అందుబాటులోకి వస్తే దాంతో సహా అన్నింటినీ డైనమిక్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌గా పిలిచే రివర్సబుల్‌ లైన్‌ ట్రాఫిక్‌ మెథడ్‌లో వినియోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిప్రకారం ఓ మార్గాన్ని పూర్తి స్థాయిలో వన్‌ వేగా మార్చకుండా... రద్దీని బట్టి ఆయా సమయాల్లో వన్‌వేగా చేస్తుంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పీక్‌ అవర్స్‌లో వన్‌వేగా ఉన్న మార్గం ఆపై టూ వేగా మారిపోతుంది. తిరిగి సాయంత్రం పీక్‌ అవర్స్‌ ప్రారంభమైనప్పు ఉదయం నడిచిన దిశకు వ్యతిరేకంగా వన్‌వేగా మారుతుంది. ఇలా చేయడం ద్వారా రద్దీని తట్టుకోవడంతో పాటు ఒకే మార్గాన్ని వివిధ రకాలుగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని భావించారు. ఈ వన్‌వేలు, వాటి సమయాలపై పూర్తి స్థాయి ప్రచారం కల్పిండంతో ప్రతి వాహనచోదకుడికీ అవగాహన కల్పిస్తే ఫలితాలుంటాయని అంచనా వేశారు. 

హెచ్‌ఎంఆర్‌ అప్పట్లో ముందుకు వచ్చినా...
మలక్‌పేట రైలు వంతెన సమీపంలో వాహనాల కోసం మరో అండర్‌ పాస్‌ ఏర్పాటుకు సహకరించడానికి అప్పట్లో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) ముందుకు వచ్చింది. ఈ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రైల్వే శాఖ ప్రారంభించడానికి ముందే రూ.10 కోట్లు డిపాజిట్‌ చేయాలని షరతు పెట్టింది. దాదాపు రెండేళ్ళ క్రితం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో బల్దియా నేతృత్వంలో జరిగిన వివిధ శాఖల ఉమ్మడి కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని హెచ్‌ఎంఆర్‌ ప్రకటించింది. ఇప్పటికీ మోక్షం లభించలేదు.

మూసీ వెంట మార్గాన్నీఅన్వేషించినా...
మరోపక్క మలక్‌పేట సమీపంలో ఉన్న మూసీ నది వెంబడి మరో రహదారి అభివృద్ధి చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ట్రాఫిక్‌ అధికారులు తమ అధ్యయనంలో గుర్తించారు. చాదర్‌ఘాట్‌ కాజ్‌వే దాటిన తర్వాత మూసీ వెంట ప్రస్తుతం ఓ మార్గం ఉంది. ఇది ఓల్డ్‌ మలక్‌పేట మీదుగా వెళ్తుంది. అయితే అనేక చోట్ల పూర్తిస్థాయిలో నిర్మాణం లేకపోవడంతో వాహనాల రాకపోకలకు అనువుగా లేదు. మరోపక్క ఈ రూట్‌ను అభివృద్ధి చేయాలంటే అనే చోట్ల అడ్డంగా ఉన్న హైటెన్షన్‌ వైర్లకూ పరిష్కారం కనుక్కోవాల్సి ఉంటుంది. దీన్ని వాహనచోదకులకు అందుబాటులోకి తీసుకువస్తే చాదర్‌ఘాట్‌ నుంచి మలక్‌పేట వెళ్ళాల్సిన అవసరం లేకుండా మూసరామ్‌బాగ్‌ సమీపంలోని అంబర్‌పేట్‌ కాజ్‌ వే వరకు ట్రాఫిక్‌ను మళ్ళించవచ్చు. ఫలితంగా ఇరుకుగా ఉన్న మలక్‌పేట రహదారిపై రద్దీ తగ్గుతుంది. ఈ మేరకు ట్రాఫిక్‌ పోలీసులు మూసీ రహదారి అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి బల్దియాకు పంపాలని భావించారు. మలక్‌పేటలో మూడో అండర్‌ పాస్‌తో పాటు వీటికీ మోక్షం కలగకపోవడంతో వాహనచోదకుడిని నిత్యం నరకం తప్పట్లేదు. 

అత్యంత కీలక రహదారుల్లో ఒకటి...
నగరంలోని అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్‌సుఖ్‌నగర్‌–చాదర్‌ఘాట్‌ మధ్యలోనిది ప్రధానమైంది. ఈ రూట్‌లో నగరానికి చెందిన అంతర్గత వాహనాలే కాకుండా విజయవాడ వైపు వేళ్లేవీ నడుస్తుంటాయి. ఫలితంగా దాదాపు 24 గంటలూ ఈ మార్గం రద్దీగానే ఉంటుంది. మలక్‌పేట రైల్వేస్టేషన్‌ పక్కన ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్‌ నెక్‌ ఈ రూట్‌లో తిరిగే వాహనచోదకులకు తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగిస్తోంది. ఆ ప్రాంతంలో చాదర్‌ఘాట్‌ వైపు మెట్రో రైల్‌ స్టేషన్‌ కూడా రావడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీని ప్రభావంతో రద్దీ వేళల్లో అటు చాదర్‌ఘాట్‌ కాజ్‌ వే వరకు... ఇటు నల్లగొండ చౌరస్తా వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ మార్గాన్ని అనుసరించాలంటేనే వాహనచోదకులు హడలిపోతున్నారు. మలక్‌పేట రైల్వేస్టేషన్‌ పక్కనే ఉన్న రైలు వంతెన అటు–ఇటు ఉన్న రహదారి కంటే ఇరుకుగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండుగల సీజన్‌లో నరకం చవిచూడాల్సిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top