హైదరాబాద్‌ మెట్రో మరో రికార్డ్‌ | Hyderabad Metro Rail Record Commuters | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ మెట్రో మరో రికార్డ్‌

Jun 9 2019 8:08 AM | Updated on Jun 9 2019 6:02 PM

Hyderabad Metro Rail Record Commuters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు శుక్రవారం మరో కొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క రోజులో ఏకంగా 2.95 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి మరో అడుగు ముందుకేసింది. వీకెండ్‌ రోజుల్లో అత్యధికంగా సాధారణ ప్రయాణికులు సైతం తమ విందు, వినోదం, షాపింగ్‌ల కోసం మెట్రో స్టేషన్లను ఎంచుకుంటున్నట్లు తాజా లెక్కలు వెల్లడించాయి. వివిధ రకాల మాల్స్‌ ఏర్పాటైన అమీర్‌పేట స్టేషన్‌ నుండి శుక్రవారం ఒక్క రోజే 19 వేల మంది ప్రయాణికులు నమోదు కాగా.. ఇటీవలే ప్రారంభమైన హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌ నుంచి 17,201 మంది ప్యాసింజర్లు మెట్రో సేవలను ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనిచేసే రోజుల్లో 2 మెట్రో రూట్లలో 2.65 మంది ప్యాసింజర్లు సగటున ప్రయాణాలు చేస్తుండగా, వీకెండ్‌లో మాత్రం రోజూ వచ్చిపోయే వారు కాకుండా సాధారణ ప్రయాణికులు (మెట్రో కార్డులు లేనివారు) మెట్రో సేవల వైపు మొగ్గుతుండటం శుభపరిణామమని హెచ్‌ఎంఆర్‌ పేర్కొంటోంది.
 
వారానికి 5 వేలు అదనంగా..  
రెండు మాసాల క్రితం వరకు వారానికి 4 వేల మంది ప్యాసింజర్స్‌ చొప్పున పెరిగిన మెట్రో గత 2 వారాల నుంచి 5 వేల మందికి పెరిగినట్లు ప్రకటించింది. ఇందులో సాధారణ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటాన్ని స్వాగతించింది. నగరంలో శుక్రవారం నాటి పరిస్థితి చూస్తే అమీర్‌పేట, హైటెక్‌ సిటీలతోపాటు ఎల్బీ నగర్‌లో 16 వేలు, మియాపూర్‌లో 14 వేలు, కేపీహెచ్‌బీలో 13 వేలు, ఉప్పల్‌లో 10 వేలు, పరేడ్‌ గ్రౌండ్‌లో 7 వేల మంది ప్రయాణాలు చేశారు. ఉప్పల్, పరేడ్‌గ్రౌండ్‌ స్టేషన్లలో జిల్లాల నుంచి వస్తోన్న ప్రయాణికుల సందడి అధికంగా కనిపిస్తోంది.

లక్ష్యం సాధిస్తాం: ఎన్వీఎస్‌రెడ్డి, ఎండీ మెట్రో రైల్‌ 
హైదరాబాద్‌ మెట్రో ఆశించిన లక్ష్యం దిశగా పరుగులు పెడుతోంది. వారానికి 5 వేల మంది చొప్పున ప్రయాణికులు అదనంగా యాడ్‌ అవుతున్నారు. మెట్రో స్టేషన్లు నగరంలో మరో కొత్త హ్యాంగవుట్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారబోతున్నాయి. ఇప్పటికే అమీర్‌పేట స్టేషన్‌ పూర్తి వ్యాపార, వినోద కేంద్రంగా మారిపోయినట్లు ప్రయాణికుల లెక్కలే చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement