ఓటర్ల జాబితా ప్రచురణకు హైకోర్టు ఓకే | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 11 2018 1:44 AM

Hyderabad High Court Green Signal To Publish Voters List - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రచురించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ముందు నిర్ణయించిన విధంగానే ఈ నెల 12న ఓటర్ల జాబితాను ప్రచురించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘానికి తేల్చి చెప్పింది. తాము చెప్పేంత వరకు ఓటర్ల జాబితాను ప్రచురించవద్దని ఈసీఐని నియంత్రిస్తూ ఈ నెల 5న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఎత్తేసింది. ఓటర్ల జాబితా ప్రచురణ బూత్‌ల వారీగా ఉండాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ఈ ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, చేర్పులు, తొలగింపులపై ఎవరైనా ఓటర్లు, ఇతర వ్యక్తులు అభ్యంతరాలను లేవనెత్తితే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. అంతేగాక తాము చెప్పిన విధంగా ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణ, చేర్పులు, తొలగింపుల విషయంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలు, ఇందుకు సంబంధించిన ఓ కార్యాచరణ ప్రణాళికను అఫిడవిట్‌ రూపంలో తమ ముందుంచాలంది. బూత్‌ల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ విషయంలో తీసుకుంటున్న చర్యలను కూడా వివరించాలని సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో భారీస్థాయిలో తప్పులున్నాయని, పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించారని, ఈ తప్పులను సరిదిద్దేంత వరకు ఓటర్ల తుది జాబితా ప్రకటించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించాలని కోరుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి గత శుక్రవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత వారం విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, తాము చెప్పేంత వరకు ఓటర్ల జాబితాను ప్రచురించవద్దని ఈసీఐను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.  

సవరణలు తెలుసుకోకుండానే... 
ఈసీ తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, ఓటర్ల జాబితా సవరణ ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం జరిగే ప్రక్రియని అన్నారు. ఎన్నికల నిర్వహించాల్సి ఉంటే రెండో సవరణ ఓటర్ల జాబితాను సవరిస్తామన్నారు. నామినేషన్‌ దాఖలు చేసే చివరి రోజు సాయంత్రం 3 గంటల వరకు సవరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రస్తుత కేసులో పిటిషనర్‌ 2015–16 ఓటర్ల జాబితా ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. పిటిషనర్‌ ఏ తప్పుల గురించి మాట్లాడుతున్నారో, వాటిని సవరించామని, సవరణలతో జాబితా ప్రచురించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఈ జాబితాను చూడకుండానే తప్పులున్నాయంటూ మాట్లాడటం సరికాదన్నారు. కోర్టు ఇచ్చే ఆదేశాలిస్తే ఈ నెల 12న జాబితాను ప్రచురించాలని భావిస్తున్నామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్‌ సామూహిక ఓట్ల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఇటువంటి సమయంలో ఆ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యమేనా? అని అవినాశ్‌ను ప్రశ్నించింది. సాధ్యం కాదని, నిర్ధిష్టంగా ఒక్కో ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ఆ తరువాతే జాబితాలో చేర్చడం, తొలగించడం చేయడం జరుగుతుందని ఆయన బదులిచ్చారు.
 
68 లక్షల బోగస్‌ ఓటర్లున్నా... 
పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పోలీసు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తీవ్రవాది వికారుద్దీన్‌ పేరు కూడా ఓటర్ల జాబితాలో ఉందన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డలకు సైతం ఓటర్ల జాబితాలో స్థానం కల్పించారన్నారు. ఇలా 68 లక్షల బోగస్‌ ఓటర్లు ఉన్నారని, ఈ విషయాన్ని తాము ఈసీఐ ముందు నిరూపించామని చెప్పారు. తాజాగా ప్రచురించిన డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాను పరిశీలించే తాము మాట్లాడుతున్నామన్నారు. అయినా తప్పులను సరిదిద్దకుండా ఓటర్ల జాబితా ప్రచురణకు ఈసీ సిద్ధమైందన్నారు. ఓటర్ల జాబితా ప్రచురించకుండా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడానికి వీల్లేదని తెలిపారు. అలిపిరి వద్ద తనపై మావోయిస్టులు దాడి చేసిన నేపథ్యంలో నాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సానుభూతి కోసం ముందస్తు ఎన్నికలకు సిఫారసు చేశారని, దీనిని అప్పటి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ లింగ్డో తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.
 
ఓటర్ల జాబితాను ప్రచురించడమే మార్గం... 
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ‘పిటిషనర్‌ చెబుతున్న తప్పులు ఓటర్ల జాబితాలో ఉన్నాయా? లేదా? తెలియాలంటే ఓటర్ల జాబితా ప్రచురించడమే మార్గం. అందువల్ల మేము ఓటర్ల జాబితా ప్రచురణకు ఆదేశాలిస్తున్నాం. రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్యం చట్టం, ఓటర్ల జాబితా తయారీ నిబంధనలను పరిశీలించాం. అలాగే ఈసీ వాదనలు కూడా విన్నాం. వీటిని బట్టి ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియని అర్థమైంది. ఎన్నికల కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ సిద్ధంగా ఉంటుంది. తప్పుల సవరణ, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను నామినేషన్‌ సమర్పణ చివరి రోజు 3 గంటల వరకు ఎన్నికల సంఘం చేపడుతుంది. ఈ నెల 12న బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించాలి. ఈ జాబితాపై ఎవరైనా అభ్యంతరాలను లేవనెత్తితే వాటిని చట్ట ప్రకారం పరిగణనలోకి తీసుకోవాలి.’అని ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది. 
    

Advertisement
Advertisement