
అయినా.. డాక్టర్ మారలేదు!
అవసరం లేకున్నప్పటికీ వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ఏపీ, తెలంగాణలకు...
- 8 మంది రిజిస్ట్రేషన్లు రద్దు
- అయినప్పటికీ కొనసాగిస్తున్న వైద్యం
- ప్రశ్నించే నాథుడు కరువు
సాక్షి, హైదరాబాద్: అవసరం లేకున్నప్పటికీ వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ఏపీ, తెలంగాణలకు చెందిన 8 మంది వైద్యుల రిజిస్ట్రేషన్లు రద్దుచేసింది. ఫలితంగా వారు ఇకపై ఎలాంటి వైద్య సేవలూ అందించరాదు. అయితే, సదరు డాక్టర్లు మాత్రం రిజిస్ట్రేషన్ల రద్దు వ్యవహారాన్ని లైట్‌గా తీసుకుని కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం చేస్తున్నారు. వైద్య వృత్తి నిబంధనలకు ఈ పరిణామం వ్యతిరేకమైనప్పటికీ.. అడిగేవారు లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు రద్దయిన వైద్యులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న ఓ ఆస్పత్రిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఓ డాక్టరు అవసరం లేకున్నా ఆపరేషన్ చేశారు. దీనిపై ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సర్జన్ రిజిస్ట్రేషన్ రద్దయింది. అయినప్పటికీ సదరు వైద్యుడు సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం కొనసాగిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ రద్దయ్యాక తిరిగి పునరుద్ధరించేవరకూ ఎలాంటి వైద్యమూ చేయకూడదని మెడికల్ కౌన్సిల్ నిబంధనల్లో ఉంది. అయినప్పటికీ సదరు డాక్టరు ఆ నిబంధనలను బేఖాతరు చేస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే, తాజాగా మరో నలుగురు వైద్యులపై కూడా మెడికల్ కౌన్సిల్‌కి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా సదరు డాక్టర్లపై కౌన్సిల్ కొరడా ఝుళిపించే అవకాశం ఉంది.
ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు
వైద్యంలో భాగంగా రోగిని మోసం చేయడం కంటే దుర్మార్గమైన చర్య మరొకటి లేదు. అనైతిక వైద్యంపై ఎంసీఐ వైద్యుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తే, తిరిగి పునరుద్ధరించేవరకూ ఆ డాక్టర్లు ఎలాంటి వైద్యమూ చేయకూడదు. అలా చేస్తే క్రిమినల్ చర్యల కిందకు వస్తుంది. వారిపై ఎంసీఐకి ఫిర్యాదు చేస్తాం.
- డా.కె.రమేష్‌రెడ్డి, ఎంసీఐ సభ్యులు