‘చల్ల’గా చరిత్ర తిరగరాశారు..

History Created By TRS MLA Challa Dharma Reddy In Parakala - Sakshi

29 ఏళ్ల తర్వాత రెండు దఫాలు గెలిచిన అభ్యర్థిగా ధర్మారెడ్డి రికార్డు

పరకాల ఏర్పడిన నాటి నుంచి 16 సార్లు ఎన్నికలు

సాక్షి, వరంగల్‌ రూరల్‌: పోరాటాల గడ్డగా పేరుగాంచిన పరకాల నియోజకవర్గం సంచనాలకు కేంద్ర బిందువు. నియోజకవర్గ ప్రజల తీర్పు 29 యేళ్ల తరువాత మళ్లీ రెండో సారి ఒకే వ్యక్తికి పట్టంకట్టారు. 1952లో ఏర్పడిన పరకాల నియోజకవర్గంలో నాటి నుంచి నేటి వరకు ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే రెండు సార్లు గెలిచే అవకాశం దక్కింది. 2018 ఎన్నికల్లో 46,519 ఓట్ల మెజార్టీతో చల్లా ధర్మారెడ్డి గెలుచి మూడో వ్యక్తిగా నిలిచాడు. 2014లో పరకాల ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు.

1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున బొచ్చు సమ్మయ్య విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో సమ్మయ్య రెండోసారి విజయం సాధించి మంత్రి పదవిని  దక్కించుకున్నారు. 1985లో బీజేపీ నుంచి ఒంటేరు జయపాల్‌ గెలుపొందగా 1989లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి జయపాల్‌ను విజయం వరించింది.  నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఒక్కొక్కరు ఒకేసారి ప్రాతినిధ్యం వహించగా సమ్మయ్య, జయపాల్, చల్లా ధర్మారెడ్డిలే  రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

భారీ మెజార్టీ సాధించిన ధర్మారెడ్డి..
పరకాల నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 46వేల మెజార్టీతో గెలుపొందడం ఇదే తొలి సారి. గతంలో రెండో సారి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో సైతం చల్లా ధర్మారెడ్డికి వచ్చిన మెజార్టీ ఎవరికి రాలేదు. 1989లో  1600, 1985లో 17,132 ఓట్లతో జయపాల్‌ గెలుపొందారు. 1978లో 8,787, 1983లో 7,295 ఓట్లతో  సమ్మయ్య గెలుపొందారు. 2014లో 9,108, 2018లో 46,519 ఓట్ల మెజార్టీతో చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు. 

పరకాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు..
పరకాల నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. 1952లో గోపాల్‌రావు (పీడీఎఫ్‌), 1957లో  కె.ప్రకాష్‌రెడ్డి (కాంగ్రెస్‌), 1962లో ఆర్‌.నర్సింహరామయ్య (కాంగ్రెస్‌), 1967లో సీహెచ్‌. జంగారెడ్డి (బీజేపీ), 1972లో పి. ధర్మారెడ్డి (కాంగ్రెస్‌), 1978లో బొచ్చు సమ్మయ్య (కాంగ్రెస్‌), 1983లో బి.సమ్మయ్య (కాంగ్రెస్‌), 1985లో ఒంటేరు జయపాల్‌ (బీజేపీ), 1989లో ఒంటేరు జయపాల్‌ (బీజేపీ), 1994లో పోతరాజు సారయ్య (సీపీఐ), 1999లో బొజ్జపెల్లి రాజయ్య (టీడీపీ), 2004లో బండారి శారారాణి (టీఆర్‌ఎస్‌), 2009లో కొండా సురేఖ (కాంగ్రెస్‌), 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మొలుగూరి బిక్షపతి (టీఆర్‌ఎస్‌) తరపున గెలిచిన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి (టీడీపీ), 2018లో చల్లా ధర్మారెడ్డి(టీఆర్‌ఎస్‌) విజయం సాధించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top