ఆర్టీసీలో నష్టాల పరంపర | hike in charges demanding in telangana | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో నష్టాల పరంపర

Oct 14 2015 3:31 AM | Updated on Sep 3 2017 10:54 AM

ఆర్టీసీ ప్రయాణం పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయే దిశగా సాగుతోంది.

 సెప్టెంబర్‌లో రూ.69 కోట్లు
 ఈ ఏడాది మొత్తం రూ.234 కోట్లు
 చార్జీల పెంపు కోసం సర్కారుపై ఒత్తిడి

 
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణం పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయే దిశగా సాగుతోంది. వేతన సవరణ రూపంలో పడ్డ భారంతో ఇప్పటికే కునారిల్లిన సంస్థ తాజాగా రికార్డుస్థాయి నష్టాల తో కోలుకోలేని స్థితికి చేరుకుంటోంది. ఆగస్టు నెలలో రూ.68 కోట్ల నష్టాలతో ఉలిక్కిపడ్డ ఆర్టీసీకి సెప్టెంబర్ నెల నష్టాలు దిమ్మతిరిగేలా చేశాయి. రూ.69.12 కోట్లు నష్టాలు వచ్చినట్టు తాజాగా లెక్క తేల్చారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి నష్టాల మొత్తం రూ.214.10 కోట్లుగా ఉండగా ఈ సంవత్సరం అది రూ.234.50 కోట్లుగా నమోదైంది. వెరసి గత ఏడాది కంటే నష్టాలు ఎక్కువగా ఉండబోతున్నట్లు దాదాపు తేలిపోయింది. హైదరాబాద్ సిటీ జోన్‌లో నష్టాలు రూ.32 కోట్లను మించిపోయాయి. కరీంనగర్ జోన్ పరిధిలో రూ.20 కోట్లు, హైదరాబాద్ జోన్ పరిధిలో రూ.17 కోట్లు నష్టాలు నమోదయ్యాయి. ఇలా తీవ్ర నష్టాలు, అప్పులకుప్పల నేపథ్యంలో కొత్తగా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సైతం ముందుకు రావట్లేదు.
 
 చార్జీల పెంపు తప్పదా?
 వేతన సవరణ సమయంలో అంతర్గత సామర్థ్యం పెంచుకుని ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. కానీ ఇప్పటికిప్పుడు ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో అర్థం కాక అధికారులు హైరానా పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా సాయమంటూ లేదు. రెండు నెలలుగా రూ.75 కోట్లు చొప్పున అందజేసిన మొత్తంతో జీతాలు చెల్లించేశారు. బస్ పాస్ మొత్తం రీయింబర్స్‌మెంట్ రూపంలో గతంలో వచ్చినట్టుగా ప్రభుత్వం నుంచి ఈ మొత్తం వచ్చింది. అంతేగానీ అదనంగా వచ్చిన సాయమంటూ లేదు. ఈ స్థితిలో బస్సు చార్జీల పెంపు ఒక్కటే మార్గమని ఆర్టీసీ భావిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వానికి నివేదించగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల భయంతో ప్రభుత్వం ఆ సాహసం చేయలేదు. మరోసారి ఒత్తిడి చేసే యోచనలో అధికారులున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కూడా చార్జీల పెంపుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తోంది. అక్కడ సానుకూల నిర్ణయం తీసుకుంటే ఇక్కడ కూడా మార్గం సుగమమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక అప్పు కోసం డిపోలను తనఖా పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement