రహదారుల అభివృద్ధికి పెద్దపీట | Sakshi
Sakshi News home page

రహదారుల అభివృద్ధికి పెద్దపీట

Published Fri, Nov 28 2014 11:47 PM

రహదారుల అభివృద్ధికి పెద్దపీట - Sakshi

రవాణా శాఖా మంత్రి మహేందర్‌రెడ్డి
 
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రవాణాశాఖా మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా రహదారుల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు విడుదల చేసిందని అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడారు. జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధికి రూ.802.10 కోట్లను కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం, నియోజకవర్గ కేంద్రం నుంచి మండలాలను కలుపుతూ రహదారులను నిర్మించేందుకు ఈ నిధులను వ్యయం చేయనున్నట్లు చెప్పారు. ఇక నుంచి గ్రామీణ, ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధితో వాహనదారులు ఇక్కట్లు తప్పనున్నాయన్నారు. దీర్ఘకాలికంగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు కలిపే మార్గాలకు రూ.147 కోట్లు, సింగిల్ లేన్ రోడ్లను డబుల్‌లేన్‌గా మార్చేందుకు రూ.435 కోట్లు, 13 వంతెనల నిర్మాణానికి రూ.220 కోట్లు కేటాయించినట్లు మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ రోడ్ల విస్తరణతో సురక్షిత ప్రయాణానికి వీలు కలుగుతుందన్నారు. విలేకర్ల సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఉషారాణి పాల్గొన్నారు.

Advertisement
Advertisement