గర్భిణీ అభ్యర్థికి హైకోర్టులో ఊరట

High Court comfort the pregnant candidate - Sakshi

దేహదారుఢ్య పరీక్ష నుంచి తాత్కాలిక మినహాయింపు 

తుది పరీక్షకు అనుమతించాలని పోలీస్‌ బోర్డుకు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం గర్భిణీగా ఉన్న ఓ మహిళా అభ్యర్థికి పోలీసు రిక్రూట్‌మెంట్‌లో దేహదారుఢ్య పరీక్ష నుంచి తాత్కాలిక మినహాయింపునిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గర్భిణీగా ఉన్న నేపథ్యంలో ఆ మహిళను రాత పరీక్షకు అనుమతించాలని పోలీసు బోర్డును ఆదేశించింది. ఫలితాలు వెలువడ్డ నెల రోజుల్లోపు దేహదారుఢ్య పరీక్షకు హాజరవుతానని రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఆమెకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీసు శాఖలో పలు పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో తాను అర్హత సాధించానని, అయితే ప్రస్తుతం తాను 27–28 వారాల గర్భంతో ఉన్నానని, అందువల్ల దేహదారుఢ్య పరీక్ష నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కోరినా బోర్డు అధికారులు స్పందించలేదంటూ సూర్యాపేట జిల్లా సోమ్లా నాయక్‌ తండాకు చెందిన ఎం.ప్రమీల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిల్లా రమేశ్‌ వాదనలు వినిపిస్తూ.. పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో వివాహిత స్త్రీలు అనర్హులని ఎక్కడా పేర్కొనలేదన్నారు.

పిటిషనర్‌ తాత్కాలికంగానే దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కోరుతున్నారని, ప్రసవం తర్వాత ఆమె దేహదారుఢ్య పరీక్షకు హాజరవుతారని తెలిపారు. మినహాయింపునిచ్చేందుకు ఇది న్యాయమైన కారణమన్నారు. అయితే అధికారులు ఈ విషయంలో ఏ మాత్రం స్పందించట్లేదని తెలిపారు. దీంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, దేహదారుఢ్య పరీక్ష నుంచి ప్రమీలకు తాత్కాలిక మినహాయింపునిచ్చారు. తుది రాతపరీక్షకు ప్రమీలను అనుమతించాలని రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top