రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ల (సీడీపీఓ) నియామకానికి హైకోర్టు బ్రేక్ వేసింది. సీడీపీఓల నియామకం నిమిత్తం 2012లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేసింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ల (సీడీపీఓ) నియామకానికి హైకోర్టు బ్రేక్ వేసింది. సీడీపీఓల నియామకం నిమిత్తం 2012లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 107 సీడీపీఓ పోస్టుల భర్తీ నిమిత్తం ప్రభుత్వం 2012, డిసెంబర్ 29న నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రస్థాయిలో పోస్టుల భర్తీ ఉంటుందని, అయితే కేటాయింపులు మాత్రం మల్టీజోన్‌ల ఆధారంగా జరుగుతుందని ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
మల్టీజోన్‌ల ఆధారంగా కాకుండా, రాష్ట్రస్థాయిలోనే కేటాయింపులు జరిపే విధంగా ఆదేశాలివ్వాలంటూ కొందరు ట్రిబ్యునల్‌ను ఆదేశించారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సమర్థిస్తూ అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేస్తూ గత నెల 29న ఉత్తర్వులిచ్చింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ బి.కవిత అనే అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వాదనల సమయంలో సీడీపీఓ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, కేటాయింపులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయన్న విషయం ధర్మాసనం దృష్టికి వచ్చింది. దీంతో ధర్మాసనం... సీడీపీఓ నియామకం నిమిత్తం 2012లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది.