ఆల్ట్రోస్ట్రాటస్ పేరుగల దట్టమైన మేఘాలు ఏర్పడటం వల్లే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్: ఆల్ట్రోస్ట్రాటస్ పేరుగల దట్టమైన మేఘాలు ఏర్పడటం వల్లే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఏప్రిల్‌లో భారీ వర్షాలు కురవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వేసవిలో ఉరుములు, వడగళ్ల వాన కురవడం సాధారణమైనా ఎడతెరిపి లేకుండా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవడం అసాధారణమేనని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణకు ఒక అల్పపీడన ద్రోణి, లక్ష్యదీప్ నుంచి గుజరాత్ వరకు కర్ణాటక మీదుగా మరో అల్పపీడన ద్రోణి రాష్ట్రాన్ని కమ్ముకున్నాయని అన్నారు. ఆల్ట్రోస్ట్రాటస్ మేఘాల వల్లనే ఇన్ని రోజులు నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయని... క్యుములోనింబస్ మేఘాల వల్ల కేవలం వర్షం వస్తూ పోతూ మళ్లీ ఎండలు కాస్తూ ఉంటాయని ఆ రెండింటికీ ఇదే తేడా అని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు సాక్షికి చెప్పారు.