భద్రాచలంలో ఉధృతంగా గోదావరి

Heavy Flood Water To Danger Bells Bhadrachalam - Sakshi

భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రెండో ప్రమాద హెచ్చరిక దాటి 50 అడుగులకు చేరుకోవటంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో గోదావరి తీర ప్రాంతాల్లోని ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, చర్ల, పినపాక మండలాల్లో నాలుగు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. గోదావరి వరద ప్రవాహం మూడో ప్రమాద హెచ్చరిక అయిన 53 అడుగులు దాటే అవకాశం ఉందని అందిన సమాచారంతో.. జిల్లాలో వరద ప్రభావానికి గురయ్యే 8 మండలాల్లో లాంచీలను సిద్ధం చేశారు. భధ్రాచలంలో 30 మంది సభ్యులుగల ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని అందుబాటులో ఉంచారు.

అయితే బుధవారం సాయంత్రానికి ఒక అడుగు నీటిమట్టం తగ్గింది. ఎగువ ప్రాంతమైన ఏటూరు నాగారం, కాళేశ్వరం లో వరద ఉధృతి నెమ్మదించిందని, దీంతో గురువారం సాయంత్రానికి భద్రాచలం వద్ద వరద ప్రవా హం మరికొద్దిగా తగ్గనుందని సబ్‌ కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు. వరద ఉధృతితో గోదావరి పరీవాహక ప్రాంతంలోని వేలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీటమునిగాయి. రహదారులు చాలా చోట్ల ఛిద్రమయ్యాయి. ఇదిలా ఉంటే భద్రాచలంలోని డ్రెయినేజీ నీటిని సకాలంలో గోదావరిలోకి పంపించే విషయంలో నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో రామాలయం పడమర మెట్లవైపు మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. అన్నదాన సత్రంలోకి కూడా డ్రైనేజీ నీళ్లు చేరాయి. గోదావరికి దిగువన ఉన్న ఏపీలోని శబరి నది కూడా పోటెత్తటంతో పోలవరం విలీన మండలాలకు రాకపోకలు స్తంభించాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top