‘టెస్టు’ పాసైతేనే... వైద్యం

Health Checkup Price Hikes In Diagnostic Centres - Sakshi

రోగ నిర్ధారణ పరీక్షల చార్జీల్లో భారీ వ్యత్యాసం

నియంత్రణ కరువు రోగుల నిలువు దోపిడీ

ఈశ్వర్‌ప్రసాద్‌ హార్ట్‌ చెకప్‌ చేయించుకునేందుకు నిమ్స్‌కు వెళ్లాడు.. డాక్టర్ల సలహా మేరకు ఈసీజీ తీయించుకున్నాడు. అంతా నార్మల్‌గా ఉండటంతో హమ్మయ్యఅనుకున్నాడు. అతడి సహోద్యోగి కూడా హార్ట్‌ చెకప్‌ చేయించుకుంటానంటేజూబ్లీహిల్స్‌లోని ఓ హాస్పిటల్‌కు తోడుగా వెళ్లాడు. బిల్లు చూసి గుండె ఆగినంతపనైంది. నిమ్స్‌లో రూ.50లకే ఈసీజీ తీశారు. అక్కడ మాత్రం రూ.450 బిల్లు వేశారు. కేవలం నాలుగైదు కిలోమీటర్ల తేడాతో బిల్లు మాత్రం దాదాపు 10 రెట్లుపెరగడంతో అతడిలో ఆందోళన కలిగింది. సరే పరికరాల్లో ఏదైనా తేడా ఉందా అంటే అదీ లేదు.. ఇలాంటి ఘటనలు నగరంలో కోకొల్లలు.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న డయాగ్నోస్టిక్‌ సంస్థలు.. కార్పొరేట్‌ పేరుతో హాస్పిటళ్లు ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో: ఓ సాధారణ డయాగ్నొస్టిక్స్‌లో కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌(సీబీపీ)కి రూ.150–200 ఖర్చు అవుతుంది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇదే పరీక్షకు రూ.700 పైగా వసూలు చేస్తున్నారు. చెస్ట్‌ ఎక్సరేకు బయట రూ.350 ఖర్చు అవుతుండగా, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.500 వరకు వసూలు చేస్తున్నారు.  తెల్లరేషన్‌ కార్డులేని రోగులకు గాంధీలో ఎంఆర్‌ఐ బ్రెయిన్‌ టెస్ట్‌కు రూ.2,000 ఛార్జీ చేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.8,500 నుంచి 12,000 వరకు వసూలు చేస్తున్నారు. పదేళ్లతో పోలిస్తే నగరంలో ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్ల సంఖ్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరిగింది. అదేస్థాయిలో ఆయా టెస్టుల కోసం ఉపయోగించే మెషినరీ ధరలు కూడా భారీగా తగ్గాయి.

అయితే వైద్య పరీక్షల ఖర్చులు తగ్గక పోగా, భారీగా పెరగడాన్ని పరిశీలిస్తే రోగ నిర్ధారణ పేరుతో కార్పొరేట్‌ ఆస్పత్రులు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకే టెస్టు, ఒకే కంపెనీ మెషిన్, కానీ రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఛార్జీల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుండటం గమనార్హం. నగరంలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు అందులో పనిచేసే వైద్యులకు టార్గెట్లు విధిస్తుండటంతో వారు అవసరం లేక పోయినా రోగనిర్ధారణ పరీక్షలు రాస్తున్నారు. సాధారణ జ్వరంతో బాధపడుతున్న రోగికి సీబీపీ, సీయూఎస్, ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ టెస్టులతో పాటు జబ్బుతో సంబంధం లేని పరీక్షలు రాస్తున్నారు. డాక్టర్‌ వద్దకు వెళ్లి సమస్య చెప్పగానే ముందుగా టెస్టులు చేయాలంటున్నారు. ఆ రిపోర్ట్‌ చూసిన తర్వాతే మందులు రాస్తున్నారు.

‘నేను కొంతకాలంగా ఛాతిలో మంట, గ్యాస్ట్రిక్‌ సమస్యతో బాధపడుతున్నాను. పంజాగుట్టలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్తే.. అక్కడి వైద్యులు ఎండోస్కోపి, కొలనోస్కోపితో పాటు సమస్యతో సంబంధం లేని సీబీపీ, సీయూపీ, ఈసీజీ, టుడిఎకో వంటి టెస్టులన్నీ రాశారు. వైద్యులు సిఫార్సు చేశారు కదా! అని ఆయా పరీక్షలన్నీ చేయించుకుని రిపోర్టులు తీసుకెళ్లి సంబంధిత వైద్యుడికి చూపిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మసాలా ఫుడ్‌ తగ్గిస్తే సరిపోతుంది’ అని చెప్పి పంపారని బంజారాహిల్స్‌కు చెందిన రఘురామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

‘నాకు ఇటీవల మోకాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్తే స్పైన్‌ ఎక్సరే, సిటీస్కాన్, ఎంఆర్‌ఐ వంటి టెస్టులన్నీ రాసి రూ.50 వేలకుపైగా బిల్లు వేసి చేతి ఇచ్చారు. పరీక్షలన్నీ చేయించుకుని రిపోర్టులు తీసుకుని వైద్యుడి వద్దకు వెళ్తే ఏ సమస్య లేదు’ అని చెప్పి పంపాడు’ అని నల్లగొండకు చెందిన రవీందర్‌రెడ్డి పేర్కొన్నాడు.  

‘రోగుల ఆర్థిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కానీ మేం మాత్రం ఏమి చేయగలం. ఆస్పత్రిలో వేతనం తీసుకుంటున్నందుకు యాజమాన్యం చెప్పినట్లు వినాల్సి వస్తోంది. అవసరం లేకపోయినా ఆస్పత్రి అవసరాల దృష్ట్యా రోగ నిర్ధారణ పరీక్షలు రాయాల్సి వస్తోంది. లేదంటే వైద్యులకూ పనిష్మెంట్లు తప్పడం లేదు’ అని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

ఉచిత సేవలకు తిలోదకాలు..
రోగ నిర్ధారణలో కీలకమైన ఎంఆర్‌ఐ, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎక్సరే, తదితర మిషన్లలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రభుత్వం వీటికి రాయితీ కూడా ఇస్తోంది. మెషిన్లపై ప్రభుత్వం నుంచి రాయితీ పొందినందుకు ఒప్పందం ప్రకారం ఆస్పత్రుల్లో 20 శాతం ఉచిత సేవలు అందించాల్సి ఉండగా, నగరంలోని ఏ ఆస్పత్రి కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. చివరకు వైద్య సేవల పేరుతో ఆస్పత్రులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి ఖరీదైన భూములు పొందిన వైద్యులు సైతం వీటిని అమలు చేయడం లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. వీధి చివరలోని డయాగ్నోస్టిక్‌ సెంటర్లోనూ.. ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ ఒకే కంపెనీకి చెందిన ఎంఆర్‌ఐ, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎక్సరే యంత్రాలు ఉన్నా... టెస్టుల పేరుతో అవి వసూలు చేస్తున్న ఛార్జీల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ఈ రోగ నిర్ధారణ ఖర్చులను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం వీటిని పట్టించుకున్న దాఖలాలు మచ్చుకైనా కన్పించడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top