గురుకులాల నియామక బోర్డుకు తుదిరూపు!

Gurukuls recruitment board to Final design  - Sakshi

     కన్వీనర్‌గా ప్రవీణ్‌కుమార్‌ను నియమించాలని యోచన 

     ప్రశ్న పత్రాల తయారీ తదితర బాధ్యతలు జేఎన్‌టీయూహెచ్‌కు! 

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో బోధన సిబ్బంది నియామకాలకు సంబంధించి రాష్ట్ర గురుకుల విద్యాలయాల సిబ్బంది నియామక బోర్డు (టీఎస్‌ఆర్‌ఈఐఆర్‌బీ) ఏర్పాటుకు ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. గురు కుల పాఠశాలల్లో బోధన సిబ్బంది నియామకా న్ని టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా ప్రత్యేక బోర్డు ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సోమవారం సీఎం కార్యాలయంలో బోర్డు ఏర్పాటుకు సంబంధించి గురుకుల సొసైటీల కార్యదర్శులు, పలువురు ఉన్నతాధికారుల తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బోర్డు ఏర్పాటుపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అధికారులు చర్చించారు. 

బోర్డు కన్వీనర్‌ నియామకం కొలిక్కి! 
నియామకాల ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం టీఎస్‌ఆర్‌ఈఐఆర్‌బీని ఏర్పాటు చేస్తోంది. బోర్డుకు కన్వీనర్‌గా ఓ ఐఏఎస్‌ అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ పేరును ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై సీఎం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. బోర్డు ఏర్పాటు ఫైలుకు సీఎం ఇప్పటికే ఆమోదముద్ర వేశారని, స్వల్ప మార్పులు చేసి 3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముందని విశ్వసనీయ సమాచారం.

ప్రశ్నపత్రాల తయారీ, సిలబస్‌ తదితర అంశాలపై జేఎన్టీయూహెచ్‌కు బాధ్యతలు అప్పగించాలని ప్రభు త్వం భావిస్తోంది. అయితే ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. మెజారిటీ అధికారులు జేఎన్టీయూహెచ్‌కు ఇవ్వాలని అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించాక ఆయన నిర్ణయం ఆధారంగా ఖరారు చేసే అవకాశముంది. ప్రస్తుతం గురుకుల పాఠశాలల్లో పూర్తిస్థాయి సిబ్బంది విధులు నిర్వర్తించాలంటే దాదాపు 5 వేల ఖాళీలను భర్తీ చేయాలి. బోర్డు ఏర్పాటైతే ఈ పోస్టులన్నీ భర్తీ చేయొచ్చని, ఈ మేరకు వరుస నోటిఫికేషన్లు వెలువరిచే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top