గురుకుల విద్యాసంస్థల అద్దె బకాయిలపై సర్కారు ఆరా
సొసైటీల వారీగా బకాయిల వివరాలు ఇవ్వాలని ఆదేశం
నెలవారీ బడ్జెట్ విడుదల నేపథ్యంలో బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యం
ఒకట్రెండు రోజుల్లో పూర్తి సమాచారం సమర్పించనున్న సొసైటీలు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల అద్దె బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రతి నెలా సంక్షేమ శాఖలకు రూ.500 కోట్లు విడుదల చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులను అటు గురుకుల విద్యా సంస్థల నిర్వహణకు, ఇటు సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, హాస్టళ్ల నిర్వహణ, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల కు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. సీఎం ఇచి్చన హామీలో భాగంగా ఈమేరకు వచ్చే నెలలో రూ.500 కోట్లు మంజూరు చేసే అవకాశం ఉంది.
ఈ నిధులను ప్రాధాన్యతా క్రమంలో వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాగా, గురుకుల విద్యా సంస్థలకు ప్రైవేటు భవనాల అద్దె భారంగా ఉంది. దాదాపు పది నెలల నుంచి అద్దె చెల్లింపులు నిలిచిపోయినట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం అద్దె బకాయిలే దాదాపు రూ.155 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ బకాయిలను ఒకే విడతలో కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నెలనెలా తీర్చాలని ప్రభుత్వం సూచించడంతో ఈమేరకు సొసైటీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు.
ఐదు నెలల్లో క్లియర్ చేసేలా..
ప్రస్తుతం పేరుకుపోయిన అద్దె బకాయిలను మార్చి నెలాఖరు నాటికి ఏ విధంగా క్లియర్ చేయవచ్చనే అంశంపై సొసైటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం అద్దె బకాయిలు రూ.155 కోట్లు ఉండగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో రూ.70 కోట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో నెలవారీగా ఏ మేరకు విడుదల చేస్తే బకాయిలను క్లియర్ చేయవచ్చనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రతినెలా రూ.15 కోట్ల మేర అద్దె బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నెలవారీగా విడుదల చేసే నిధులకు అదనంగా.. గత బకాయిలను కలుపుకొంటూ చెల్లింపులు చేసేందుకు గురుకుల సొసైటీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
సొసైటీల వారీగా అద్దె భవనాల సంఖ్య, అద్దె బిల్లుల బకాయిలు, కొత్తగా చెల్లించాల్సిన మొత్తం.. తదితర అంశాలతో కూడిన ప్రతిపాదనలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గురుకుల సొసైటీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సొసైటీ అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్ ఆధారంగా వివరాలు సమర్పించేందుకు చర్యలు చేపట్టారు. ఒకట్రెండు రోజుల్లో ఈ వివరాలతో కూడిన ప్రతిపాదనలను సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి సమర్పిస్తామని సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా గురుకుల అద్దె భవనాల బకాయిలు దాదాపు క్లియర్ అవుతాయని అధికారులు భావిస్తున్నారు.


