పరుచుకున్న పచ్చదనం   

Greenery In Nehru Park - Sakshi

నెహ్రూపార్కులో ప్రకృతి సోయగం

పాతపార్కులో కొత్త అందాలు

జిల్లా కేంద్రంలో ప్రజలకు ఆటవిడుపు

ప్రారంభానికి చేరువలో నందనవనం

సిరిసిల్లటౌన్‌ :  అందమైన చెమన్లు..రంగురంగుల పూలమొక్కలు..పిల్లలను అలరించే ఆటవస్తువులు..విద్యార్థులకు డిజిటల్‌ లైబ్రరీ..సందర్శకులను కట్టిపడేసే ఆంపిథియేటర్‌.. ఇవన్నీ ఎక్కడో నగరాల్లోని పార్కులో కనిపించే దృశ్యాలు. అయితే ఇవన్నీ ఇక కార్మికక్షేత్రంలోని సిరిసిల్లవాసులను కనువిందు చేయనున్నాయి. పక్షంరోజుల్లో ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు కొత్త అందాలతో సిద్ధమైన నెహ్రూపార్కుపై కథనం..

అమాత్యుడి ఆదర్శం.. పట్టణానికి తలమానికం

స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌ ఆదర్శమైన ఆలోచనలతో పురాతన పార్కును పట్టణానికే తల మానికంగా నిలిచేలా తీర్చిదిద్దారు. కార్మికక్షేత్రమైన సిరిసిల్లలో చాలారోజులుగా పట్టణ ప్రజలు, ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఆహ్లాదం కొరవడిందని తెలుసుకున్న ఆయన ప్రత్యేక నిధులు కేటాయించి.. పట్టణంలో మున్సిపల్‌కు సంబంధించిన రెండు కొత్త పార్కులను ఏర్పాటు చేయించారు.

మూడున్నర దశాబ్దాల క్రితం నిర్మితమైన పాత నెహ్రూపార్కు, ఇందిరా పార్కులను కూడా అభివృద్ధి పరిచేలా మున్సిపల్‌కు ప్రత్యేకంగా నిధులు అందించారు. అయితే నెహ్రూపార్కును ‘సోషల్‌ రెస్పాన్సిబిలిటీ’తో హైదరాబాద్‌కు చెందిన ‘ఫీనిక్స్‌’ ప్రముఖ కంపెనీ ఆధునిక సాంకేతికతో అభివృద్ధి చేసింది. 

ఆధునిక హంగులతో..

విస్తరిస్తున్న సిరిసిల్ల పట్టణంలోని ప్రజల అవసరాల మేరకు విద్యానగర్‌లోని పాత నెహ్రూపార్కును అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు పూర్తికావచ్చాయి. 15న పార్కును ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచే విధంగా పార్కు సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.

ఏళ్ల తరబడి బోసిపోయిన అందాలతో కునారిళ్లిన ఈపార్కు ఇప్పుడు పూర్తిగా ఆధునిక హంగులతో అందాలను సొంతం చేసుకుంది. ఇందులోకి వెళ్లగానే సందర్శకులకు అందమైన చెమన్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలకు ఆటకేంద్రంగా తయారైంది. వీటితో పాటు విజ్ఞానాన్ని పంచేలా విద్యార్థులకు డిజిటల్‌ లైబ్రరీ స్థానికంగానే అందుబాటులోకి రావడం విశేషం.

డిజిటల్‌ సొగసులతో..

పాత నెహ్రూపార్కుకు హైదరాబాద్‌ కార్పొరేట్‌ సంస్థ డిజిటల్‌ సొగసులను మేళవించింది. సుమా రు 30గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈపార్కులో బోటింగ్‌ కొలను, డిజిటల్‌ లైబ్రరీ, పిల్లలకోసం ఆంపిథియేటర్, చూడముచ్చట గొలిపే వాటర్‌ ఫౌంటేన్లు, పిల్లల ఆటవస్తువులను ఏర్పాటు చేసింది.

పార్కులోకి వెళ్లిన వారు మైమరిచిపోయేలా అత్యాధునిక పరిజ్ఞానంతో కొత్త నిర్మాణాలు చేపట్టింది. పార్కులోంచి నేరుగా పక్కనే ఉన్న మున్సిపల్‌ ఈతకొలనుకు సందర్శకులు వెళ్లే సౌకర్యం కల్పించింది. ఇప్పటికే తొంభైశాతం పనులు పూర్తయిన ఈపార్కు అందాలను సందర్శకులు వీక్షిస్తూ.. మున్సిపల్‌ అధికారులకు కితాబిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా పూర్తయ్యాయి.

పంద్రాగస్టుకు ప్రారంభిస్తాం  

పట్టణవాసులకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచేలా పార్కును ఆధునికీకరించాం. హైదరాబాద్‌కు చెందిన బిల్డ్‌కాం కంపెనీ వారు పార్కును నవీకరిస్తున్నారు. పంద్రాగస్టులోగా పార్కులో అన్ని పనులు పూర్తి చేయించి మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించేలా ఏర్పాటు చేస్తున్నాం. పట్టణ ప్రజలతో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా ముస్తాబైంది. 

– కేవీ రమణాచారి, మున్సిపల్‌ కమిషనర్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top