గ్రానైట్ పరిశ్రమలతో కాలుష్యం | Granite industries, pollution | Sakshi
Sakshi News home page

గ్రానైట్ పరిశ్రమలతో కాలుష్యం

Dec 13 2014 1:32 AM | Updated on Sep 4 2018 5:07 PM

గ్రానైట్ పరిశ్రమలతో కాలుష్యం - Sakshi

గ్రానైట్ పరిశ్రమలతో కాలుష్యం

కరీంనగర్ మండలం శ్రీరాములపల్లెకు చెందిన సత్తు వీరయ్య తనకున్న ఎకరం భూమిలో పత్తి సాగు చేశాడు. స్ధానికంగా ఉన్న ఓ గ్రానైట్ కటింగ్ పరిశ్రమ నుంచి వెలువడే దుమ్ము, ధూళి పత్తిచేనంతా నిండిపోయింది.

కరీంనగర్ మండలం శ్రీరాములపల్లెకు చెందిన సత్తు వీరయ్య తనకున్న ఎకరం భూమిలో పత్తి సాగు చేశాడు. స్ధానికంగా ఉన్న ఓ గ్రానైట్ కటింగ్ పరిశ్రమ నుంచి వెలువడే దుమ్ము, ధూళి పత్తిచేనంతా నిండిపోయింది. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థజలంతో సగానికిపైగా మొక్కలు ఎర్రబడిపోయాయి. దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి రాక అప్పులపాలయ్యాడు. మూడేళ్లుగా వీరయ్యది ఇదే పరిస్థితి. పలుమార్లు పరిశ్రమ యజమానికి, అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని వీరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్ధితి ఒక్క వీరయ్యది మాత్రమే కాదు.. శ్రీరాములపల్లి, కమాన్‌పూర్, ఎలగందల్, బావుపేట, ఖాజీపూర్, నాగులమల్యాల గ్రామాల్లోని పలువురు రైతులది. గ్రానైట్ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యానికి ఆయా గ్రామాల్లోని రైతులంతా బలవుతున్నారు.
 
 కరీంనగర్ రూరల్: గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ పరిశ్రమ క్రమేపీ విస్తరిస్తోంది. మూడేళ్ల నుంచి ఈ పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. గతంలో ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, ప్రకాశం తదితర జిల్లాల్లో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలు ఉండేవి. క్వారీల నుంచి ఎక్కువ దూరం ఉండటంతో వ్యాపారులపై ఆర్థిక భారం పడటంతో స్థానికంగానే గ్రానైట్ రాళ్లను కట్ చేసి, పాలిషింగ్ చేసే పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ప్రధానంగా బావుపేట, ఎలగందల్, ఖాజీపూర్, నాగులమల్యాల గ్రామాల్లో గ్రానైట్ క్వారీలు ఎక్కువగా ఉండటంతో సమీపంలో ఈ పరిశ్రమలను స్థాపించారు. బావుపేటలో 54, ఖాజీపూర్‌లో 25, ఎలగందల్‌లో 15, నాగులమల్యాలలో 10 పరిశ్రమలున్నాయి.
 
 రోడ్లపక్కనే డస్ట్‌నిల్వలు
 పరిశ్రమల నుంచి వచ్చే దుమ్ము, ధూళితో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రానైట్ రాళ్లను కట్ చేస్తుండగా వచ్చే డస్ట్‌ను సమీపంలోని రహదారులు, గ్రామాల్లోని ఖాళీ ప్రాంతాల్లో నిల్వచేస్తున్నారు. రోడ్ల పక్కన నిల్వచేసిన డస్ట్ గాలికి ఎగిరివచ్చి ప్రయాణికుల కళ్లల్లో పడుతోంది. దుమ్ము, ధూళితో ద్విచక్రవాహనదారులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సిరిసిల్ల రహదారిలోని శ్రీరాములపల్లె నుంచి మొదలుకుని ఒద్యారం వరకు, ఎలగందల్, ఖాజీపూర్, నాగులమల్యాల గ్రామాల్లోని రహదారుల వెంట డస్ట్‌ను లారీలు, ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. పరిశ్రమల ఎదుట నీటిగుంతల్లో వ్యర్థ నీటిని నిల్వచేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. డస్ట్ నిల్వలపై ఆయా గ్రామాల సర్పంచులు, స్థానికులు పలుమార్లు మైనింగ్, విజిలెన్స్, కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పరిశ్రమల సమీపంలో ఉన్న పత్తిచేన్లలో దుమ్ము చేరడంతో దిగుబడి రాక పలువురు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పొలాల వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 రూ. 2కోట్ల పన్నుల బకాయిలు
 నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీలకు ప్రతి ఏటా పన్నులను చెల్లించడంతో గ్రానైట్ పరిశ్రమల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమ స్థాపించేటపుడు మాత్రమే పంచాయతీలకు చెల్లించాల్సిన అనుమతి పన్నులను చెల్లిస్తున్నారు. ఆ తర్వాత ఏటా పన్నులు చెల్లించకపోవడంతో సర్పంచులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడంలేదు. గత ఐదేళ్ల నుంచి వ్యాపారులు పన్నులు చెల్లించకపోవడంతో నాలుగు గ్రామపంచాయతీలకు దాదాపు రూ.2కోట్లకుపైగా బకాయిలున్నాయి. ఒక్క బావుపేట గ్రామపంచాయతీకి రూ.కోటి వరకు పన్ను రావాల్సి ఉందని సర్పంచ్ దావ వాణి తెలిపారు.
 
  పన్నులు చెల్లించాలని పరిశ్రమల యజమానులకు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. గ్రానైట్ పాలిషింగ్ రాళ్ల ఎగుమతితో కోట్లాది రూపాయల ఆదాయం గడిస్తున్న వ్యాపారులు పన్నులు చెల్లించడానికి మాత్రం ముందుకురాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కాలుష్య నియంత్రణ, పన్నుల వసూళ్లకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు విజప్తి చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement