10 శాతంపై ఇక లెక్క.. పక్కా

Govt focus on empty lands - Sakshi

ఖాళీ స్థలాలపై బిగుస్తున్న సర్కార్‌ పట్టు

పంచాయతీల ఖాతాలో 1,764 ఎకరాలు

వీటి విలువ రూ.5 వేల కోట్ల పైమాటే

రంగారెడ్డి జిల్లా సరికొత్త రికార్డు

లేఅవుట్లపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించిన డీపీవో

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మొండికేసిన రియల్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం పైచేయి సాధించింది. లేఅవుట్లలో పది శాతం ఖాళీ స్థలాలను పంచాయతీలకు బదలాయించకుండా అట్టిపెట్టుకున్న జాగాలను ఎట్టకేలకు స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రంగారెడ్డి జిల్లాలో ఏకంగా రూ.5 వేల కోట్ల విలువైన భూములను తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పటి వరకు 1,764.07 ఎకరాలను గుర్తించిన యంత్రాంగం.. వీటిపై యాజమాన్య హక్కులు పొందే దిశగా అడుగులు వేస్తోంది.

నిబంధనలు ఉల్లంఘించి..
ఏదేనీ వెంచర్‌/లేఅవుట్‌ అభివృద్ధి చేస్తే మొత్తం విస్తీర్ణంలో పది శాతం ఓపెన్‌ ఏరియాను స్థానిక గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా అప్పగించాలి. ఈ స్థలాన్ని గిఫ్ట్‌ డీడ్‌ రూపేణా రిజిస్ట్రేషన్‌ చేయాలి. అయితే, ఈ నిబంధన క్షేత్రస్థాయిలో అమలవ్వడం లేదు. లేఅవుట్లలో ఖాళీ స్థలంగా పేర్కొన్న జాగాలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదనే ఆంక్షలు ఉన్నప్పటికీ రియల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అమ్మేస్తున్నారు. ఈ స్థలాలను కాపాడాల్సిన పంచాయతీ కార్యదర్శులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో వీటికి రెక్కలొస్తున్నాయి. ఇలా ఎక్కడికక్కడ భూములను కొల్లగొడుతుండటంతో నగరీకరణ నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న కాలనీల్లో పచ్చదనం లేకుండా పోతోంది.

ప్రజావసరాలకే ఉపయోగించాలి
హెచ్‌ఎండీఏ లేదా డీటీసీపీ లేఅవుట్ల ప్లాన్లలో పది శాతం భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరత్రా అవసరాలకు వినియోగించరాదు. ఒకవేళ భూ వినియోగ మార్పిడి జరగాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ స్థలంలో పచ్చదనం లేదా సామాజిక అవసరాలకు అది కూడా కలెక్టర్‌ ఆమోదంతో చేపట్టాలి. అయితే, ఇవేవీ పట్టించుకోని వ్యాపారులు వీటిని కూడా అమ్మేస్తున్నారు. నగర శివార్లలో భూముల విలువలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో కారుచౌకగా లభించే ఈ స్థలాలను ల్యాండ్‌ మాఫియా కొట్టేస్తోంది. మరోవైపు కొన్ని చోట్ల ఈ స్థలాల్లో ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా వెలిశాయి. ఈ నేపథ్యంలో ఇలా కైంకర్యమవుతున్న స్థలాలను కాపాడాలని భావించిన జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి.. లేఅవుట్లపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. తద్వారా రియల్టర్ల కబంధ హస్తాల్లో చిక్కుకున్న వేలాది ఎకరాలకు విముక్తి కల్పించారు.

భారీగా భూ నిధి..
పది శాతం స్థలాలపై పట్టు బిగించిన జిల్లా యంత్రాంగం.. ఇందులో 837 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకుంది. జిల్లావ్యాప్తంగా భారీగా ల్యాండ్‌ బ్యాంక్‌(భూ నిధి)ను సమకూర్చుకున్న పంచాయతీలకు భవిష్యత్తులో ప్రజావసరాలకు సరిపడా స్థలాలు దక్కాయి. కాగా, విలువ ప్రకారం చెప్పుకుంటే రాజేంద్రనగర్‌లో అత్యంత ఖరీదైన స్థలాలు గ్రామ పంచాయతీల వశమయ్యాయి. ఈ మండలంలో ఏకంగా 97 ఎకరాలు సేకరించిన అధికారగణం.. వీటి ఖరీదు రూ.1,400 కోట్లపైనే ఉంటుందని లెక్కగట్టింది. మహేశ్వరంలో స్వాధీనం చేసుకున్న 440 ఎకరాల విలువ దాదాపు రూ.450 కోట్లు ఉంటుందని అంచనా వేస్తోంది. ఇదిలావుండగా, అక్రమ లేఅవుట్లు పుట్టుకురాకుండా చర్యలు తీసుకుంటోంది. పంచాయతీల వారీగా భూ రికార్డులను తయారు చేస్తోంది.

పార్కులుగా అభివృద్ధి చేస్తాం
సేకరించిన స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే 1.95 లక్షల మొక్కలు నాటాం. ఆర్థిక వనరులు బాగా ఉన్న గ్రామాల్లో ఆ స్థలాలకు ప్రహరీలు నిర్మిస్తున్నాం. ఇంకా స్థలాలు అప్పగిం చని, అమ్ముకున్నట్లు తేలిన రియల్టర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.
– డీపీవో పద్మజారాణి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top