నా పేరులోనే జీవవైవిధ్యం! 

Governor Narasimhan funny comment at the Biodiversity Conference - Sakshi

     ‘నర.. సింహం’ రెండూ ఉన్నాయి.. 

     జీవవైవిధ్య సదస్సులో గవర్నర్‌ సరదా వ్యాఖ్య 

     పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని సూచన 

     వైవిధ్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత: జోగు రామన్న 

     వ్యవసాయ వర్సిటీలో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం 

సాక్షి, హైదరాబాద్‌: జీవవైవిధ్యానికి తన పేరే నిదర్శనమని.. తన పేరులోనే ‘నర.. సింహం’ వైవిధ్యం ఉందని గవర్నర్‌ నరసింహన్‌ సరదాగా వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 25వ అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్‌.. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. భారతీయులు వేల సంవత్సరాలుగా జీవవైవిధ్యాన్ని పాటిస్తున్నారని.. భారత సంస్కృతి, సంప్రదాయాల్లోనే జంతువులు, వృక్షాలను పూజించే సంస్కృతి ఉందని నరసింహన్‌ పేర్కొన్నారు. ప్రతి దేవుడి వాహనంగా ఒక జంతువు ఉంటుందని, అలా జంతువులకు కూడా దేవుడితో సమానంగా పూజలు చేసే సంస్కృతి ఉందని చెప్పారు.

జీవవైవిధ్యం అంటే పర్యావరణ పరిరక్షణ కూడా అని.. అందుకే పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కృషి చేయాలని సూచించారు. ఒకప్పుడు హైదరాబాద్‌ నగరం చెరువులతో కళకళలాడేదని, ఇప్పుడు కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయిందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం మనిషికి మంచి చేసేదిగా ఉండాలేగానీ.. చెడు చేసేలా ఉండకూడదని చెప్పారు. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం మనల్ని కాపాడలేదని, పర్యావరణ పరిరక్షణ ఒక్కటే మనం ఆరోగ్యంగా జీవించడానికి తోడ్పడుతుందని స్పష్టం చేశారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

మనుగడకు వైవిధ్యమే ఆధారం: జోగు రామన్న 
జీవవైవిధ్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని.. మనిషి మనుగడకు, జీవనోపాధికి కూడా జీవవైవిధ్యమే ఆధారమని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. జీవవైవిధ్యంలో ప్రపంచంలోనే భా రతదేశం 8వ స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఏర్పాటు చేసి.. ‘జీవవైవిధ్య నియమావళి–2015’ను రూపొందించిందని చెప్పారు. జీవ వనరుల సేకరణ, వినియోగానికి సంబంధించిన కార్యకలాపాలపై నియంత్రణ, స్థానిక సంస్థల పరిధిలో జీవవైవిధ్య యాజమాన్య కమిటీల ఏర్పాటు, జీవవైవిధ్య వారసత్వ స్థలాల గుర్తింపు, నిర్వహణ విధులను జీవవైవిధ్య మండలి చేపడుతోందన్నారు. రాష్ట్రంలో జీవవైవిధ్యానికి నెలవుగా మెదక్‌ జిల్లాలోని అమీన్‌పూర్‌ చెరువును గుర్తించామని, అక్కడికి దేశదేశాల నుంచి పక్షులు వలస వస్తాయని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు, కాలుష్యం తగ్గుముఖం పట్టేలా చర్యలు చేపడుతున్నామన్నారు. 

పలువురికి జీవవైవిధ్య అవార్డులు 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ ఉపాధిని పొందుతున్న పలువురికి ‘ఇండియా జీవవైవిధ్య సదస్సు–2018’అవార్డులను గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం చేశారు. బహుమతిగా లక్ష రూపాయల చెక్కు ఇచ్చారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top