షిర్డీ సాయి మార్గం అనుసరణీయం

Governor Narasimhan comments over saibaba - Sakshi

     ‘బాబా మహా సమాధి శతాబ్ది’లో గవర్నర్‌  

     బాబా అంటేనే గుర్తొచ్చేది సేవాభావమని వెల్లడి 

హైదరాబాద్‌: షిర్డీ సాయిబాబా చూపిన మార్గం  అనుసరణీయమని, బాబా అంటేనే  సేవాభావమని గవర్నర్‌  నరసింహన్‌ పేర్కొన్నారు. షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌ గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దానగుణం, అంతరాత్మ శాంతి, సంతృప్తి, సేవాభావాన్ని ఆచరించిన మహనీయుడు బాబా అన్నారు. ఎన్ని పదవులు, ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతత లేని జీవితం వ్యర్థమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

సాయి భక్తుల్లో ప్రేమ, దయ, క్షమాగుణం కనిపిస్తాయని, అంతా సేవా దృక్పథాన్ని అనుసరించాలన్నారు. సాయిబాబాతో తన అనుబంధం మాటల్లో చెప్పలేనని ప్రముఖ హీరో నాగార్జున అన్నారు. 2012లో షిర్డీ సాయిబాబా చిత్రం తీసే వరకు బాబా గురించి కొంత తెలిసిందని, కానీ తన స్నేహితుడు మహేశ్‌రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు ద్వారా పూర్తిగా తెలుసుకొని అనుభూతికి లోనయ్యానన్నారు. షిర్డీ సాయి సేవా సంస్థాన్‌ ట్రస్ట్‌ హైదరాబాద్, షిర్డీసాయి గ్లోబల్‌ ఫౌండేషన్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం డాక్టర్‌ సతీశ్‌రెడ్డి, డాక్టర్‌ పి. రఘునాథరెడ్డిల పర్యవేక్షణలో  జరిగింది. ఇందులో ఏపీ మంత్రి మాణిక్యాలరావు, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి,  డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రసేనారెడ్డి, చెంగారెడ్డిలతోపాటు పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. 

పుస్తకాల ఆవిష్కరణ... 
ఈ సందర్భంగా షిర్డీసాయి గ్లోబల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ చంద్రభాను శత్పతి రాసిన ‘సాయి శకం’ను గవర్నర్, ‘షిర్డీ సాయిబాబా అదర్‌ పర్‌ఫెక్ట్‌ మాస్టర్స్‌’తెలుగు అనువాద పుస్తకాన్ని దత్తాత్రేయ, ‘షిర్డీ సాయిబాబా–భక్తుల ప్రశ్నలు’పుస్తకాన్ని విశ్వేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. కాగా షిర్డీసాయి బాబా అరుదైన చిత్రాలను భక్తులు తిలకించేలా చేసిన ఏర్పాట్లు ప్రత్యేకతగా నిలిచాయి. గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి, విద్యార్థులు వివిధ రకాల నృత్యాలతో అలరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top