బీసీ వసతిగృహాల్లో విందు భోజనం

Good Food In The BC Hostel - Sakshi

టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగింత

టైం ప్రకారం అన్ని సమకూర్చాల్సిందే

మెనూ పాటించకుంటే చర్యలు

వికారాబాద్‌ అర్బన్‌: ఉడికి ఉడకని అన్నం పెట్టడంతో విద్యార్థులు రోడెక్కిన దాఖలాలు ఉన్నాయి. వారంలో ఒకే రకమైన వంటకాలు పెట్టడంతో తినలేక కడుపులు మాడ్చుకున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితులను మార్చేందుకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ప్రతి వసతి గృహానికి రోజు వారీగా మెనూ పాటించాలనే నిబంధనలున్నా అక్కడ పనిచేసే వార్డెన్లు పెద్దగా పట్టిచుకునే వారుకాదు. 

మెనూ నిబంధనలు గోడమీద రాతలకు మాత్రమే పరిమితమయ్యేవి. వార్డెన్లకు ఏది ఇష్టం వస్తే అది వండించి పెట్టేవారు. పైగా ఉదయం, సాయంత్రం పెట్టాల్సిన అల్పహారం పిల్లలు ఏనాడు ఎరుగరు. విద్యార్థులకు కూరగాయలు పెట్టకుండానే వార్డెన్లు బిల్లులు తీసుకునేవారు. ఇప్పుడు విద్యార్థుల భోజనానికి అవసరమైన కూరగాయలు, వంట సామగ్రి, గుడ్లు, చికెన్‌ వార్డెన్లు కొనాల్సిన అవసరంలేదు.

జిల్లాలోని 21 బీసీ పాఠశాల స్థాయి వసతి గృహాలకు, 7 కళాశాల స్థాయి వసతి గృహాలకు విడివిడిగా టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. వారు తెచ్చిచ్చిన వస్తువులను వార్డెన్లు దగ్గరుండి వండించి విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టించాలి. అధికారుల నిర్ణయంతో బీసీ వసతిగృహాల్లో ఉండే పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇక మీదట విందు భోజనం చేయనున్నారు.

కళాశాల విద్యార్థులకు ఉదయం టిఫిన్‌.. 

బీసీ కళాశాల స్థాయి విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం 7గంటలకు చాయ్‌తో పాటు పార్లేజీ బిస్కెట్‌ ప్యాకెట్‌ ఒకటి ఇస్తారు. ప్రతి సోమవారం 8 గంటలకు టిఫిన్‌ చెట్నితో పాటు ఉప్మా, ఒక అరటి పండు ఇస్తారు. మంగళవారం పులిహోరా అరటి పండు, బుధవారం ఆలు బాత్‌ సాంబర్, అరటి పండు, గురువారం కిచిడి సాంబర్, అరటి పండు, శుక్రవారం ఉప్మా చెట్ని, అరటి పండు, శనివారం జీరా రైస్, అరటి పండు, ఆదివారం ఇడ్లి చెట్ని లేదా సాంబర్‌ ఇస్తారు.  

మధ్యాహ్నం భోజనం.. 

ప్రతీ సోమవారం మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు ఆకుకూర పప్పు, రసం, మంగళవారం కూరగాయలు, సాంబర్, బుధవారం ఆకుకూర పప్పు, రసం, గురువారం కూరగాయ లు, సాంబర్, శుక్రవారం ఆకుకూర పప్పు, రసం, శనివారం కూరగాయలు, సాంబర్, ఆదివారం బిరియాని, చికెన్‌ కర్రి, రైతా, సాంబర్‌ ఇస్తారు. 

రాత్రి భోజనంలో.. 

ప్రతీ సోమవారం అన్నంతో పాటు కూరగాయలు, పెరుగు, సాంబర్, గుడ్డు, మంగళవారం ఆకుకూర పప్పు, రసం, పెరుగు, గుడ్డు, బుధవారం చికెన్‌ కర్రి, సాంబర్, రైతా, గురువారం ఆకుకూర పప్పు, సాంబర్, గుడ్డు, శుక్రవారం కూరగాయలు, పెరుగు, సాంబర్, గుడ్డు, శనివారం ఆకుకూర పప్పు, రసం, పెరుగు, గుడ్డు, సేమియా స్వీట్, ఆదివారం ఆకుకూర పప్పు, రసం, గుడ్డు. 

పాఠశాల స్థాయి విద్యార్థులకు.. 

సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజు ఉదయం పాలు చక్కెరతో రాగి మాల్ట్‌ ఇస్తారు. కళాశాల విద్యార్థులకు ఇచ్చే మెనూ ప్రకారమే పాఠశాలకు విద్యార్థులకు అల్పహారం ఇవ్వనున్నారు. ఆదివారం మాత్రం వసతిగృహంలోనే బిర్యాని, చికెన్‌ కర్రి పెట్టనున్నారు. సాయంత్రం 5గంటలకు సోమవారం తాలింపుతో అటుకులు, మంగళవారం ఉడికించిన బొబ్బర్లు, బుధవారం ఉడికించిన శనగలు, గురువారం ప్యార్లేజీ బిస్కెట్‌ ప్యాకెట్, శుక్రవారం తాలింపుతో అటుకులు, శనివారం సేమియా స్వీట్, ఆదివారం పల్లిపట్టి ఒకటి. రాత్రి భోజనంలో కళాశాల విద్యార్థుల మెనూ ప్రకారంగానే రోజు అన్నంతో పాటు, ఆకు కూరలు, కూరగాయలు, గుడ్డు పెట్టనున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు 

విద్యార్థులకు పెట్టే భోజనంలో వార్డెన్లు ఏమాత్రం నిబంధనలు అతిక్రమించినా, నిర్లక్ష్యం చేసినా కఠినంగా వ్యవహరిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలనే తపన కలెక్టర్, జేసీకి ప్రగాడంగా ఉంది. ప్రతి వసతి గృహంలో తప్పకుండా మెనూ పాటించాలి. కూరగాయలు, ఇతర సామగ్రికి టెండర్లు పొందిన వారు సక్రమంగా సరఫరా చేయాలి. లేనిపక్షంలో వారి స్థానంలో మరొకరిని నియమిస్తారు. వార్డెన్లు తప్పు చేస్తే శాఖపరమైన చర్యలు ఉంటాయి. 

    – ఏ.పుష్పలత, జిల్లా బీసీ వెల్పేర్‌ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top