బండెడు చాకిరీలో బాల్యం

Girl Labour Child in Hyderabad - Sakshi

బాలకార్మికులుగా మగ్గుతున్న వారిలోనూ, పేదరికం కారణంగా చదువులకు దూరమవుతున్న వారిలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా  ఉన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 6 లక్షల మంది ఇళ్లల్లో పని చేస్తుండగా, వారిలో కనీసం 2.5 లక్షల మంది బడి ఈడు అమ్మాయిలే కావడం గమనార్హం. చాలా కుటుంబాల్లో  అబ్బాయిలను ప్రైవేట్‌ స్కూళ్లలో చదివిస్తుండగా, అమ్మాయిలను మాత్రం సర్కారీ బడులకు పంపుతున్నారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో  అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. చదువుతో పాటు పని తప్పనిసరిగా మారుతుంది. కుటుంబ భారాన్ని  మోసేందుకు ఇళ్లల్లో పనికి వెళ్తున్న మహిళలతో పాటు వారి కూతుళ్లు కూడా తప్పనిసరిగా పనిబాట పడుతున్నారు. 

అమ్మకు ఆసరా..
రామంతాపూర్‌నకు చెందిన మౌనిక  ఓ స్వచ్ఛంద సంస్థ నడిపే స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. పేదరికం కారణంగా చదువు మానేసిన సోదరి, బేకరీలో పని చేసే అన్నయ్యతో పాటు తల్లిదండ్రులు ఉన్నారు. అందరూ ఏదో ఒక పని చేస్తున్న వాళ్లే. అయినా  స్కూల్‌కెళ్లి చదువుకుంటున్న మౌనికకు సైతం తల్లితో పాటు ఇళ్లల్లో పని తప్ప లేదు. ఇద్దరూ కలిసి ఐదారు ఇళ్లల్లో పని చేస్తున్నారు. ‘చదువుకుంటుందని చెప్పి పనికి తీసుకెళ్లకుండా ఉంటే ఇల్లు గడుస్తుందా’ అని అంటోంది మౌనిక తల్లి యాకమ్మ.‘బాగా చదువుకోవాలని ఉంది. కానీ పనికెళ్లకుండా ఎలా సాధ్యం’ అంటోంది మౌనిక. పేదరికం కారణంగా అక్క చదువు ఆగిపోయినట్లు తన చదువు ఆగిపోకూడదని ఆ బాలిక కోరుకుంటోంది.

చదువు సాగేదెట్లా..  
పద్మకు ఒక్కగానొక్క కూతురు వేదిత. తొమ్మిది చదువుతోంది. పద్మ భర్త ఈశ్వర్‌ పక్షవాతంతో మంచాన పడ్డాడు. దీంతో భారమంతా పద్మపైనే పడింది. ఒకప్పుడు బాగానే బతికినా ఆకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇళ్లల్లో పని చేస్తోంది. కానీ తనతో పాటు కూతురి శ్రమ కూడా తప్పనిసరైంది. ‘నా కూతురును బాగా చదివించాలనుకుంటున్నాను. కానీ పేదరికం వల్ల ఎక్కడ ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందోననే భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో పాటు పనికి రావద్దని కోరుకుంటా. అయినా తప్పడం లేదు.’ అంటూ ఆవేదన  వ్యక్తం చేసింది పద్మ. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top