విభిన్నంగా విచ్ఛిన్నం!

GHMC Special Service For COVID 19 Wastage in Hyderabad - Sakshi

ప్రత్యేక పద్ధతిలో కోవిడ్‌ వ్యర్థాల శుద్ధి   

రోజుకు సుమారు టన్ను మేర..     

55 ప్రత్యేక వాహనాల్లో తరలింపు

ఇప్పటివరకు 60 టన్నుల సేకరణ

అత్యధికంగా గాంధీ ఆస్పత్రి నుంచే..  

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ మహమ్మారి సోకిన రోగులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్న  తరహాలోనే.. వారికి చికిత్సనందించే ఆస్పత్రుల నుంచి సేకరించిన వ్యర్థాలను సైతం అంతే జాగ్రత్తగా శుద్ధి చేస్తున్నారు. రోజుకు సుమారు టన్నుపైగానే ఈ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, ప్రాంతాల్లోని 12 ప్రభుత్వ ఆస్పత్రులు, 128 క్వారంటైన్‌ కేంద్రాలు, 7 నమూనా సేకరణ కేంద్రాలు,10 ల్యాబ్‌ల నుంచి నిత్యం కోవిడ్‌ జీవ వ్యర్థాలను సేకరిస్తున్నారు. వీటిని రాష్ట్రంలోని 11 కామన్‌ బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్లకు తరలించి పర్యావరణానికి హాని కలగని రీతిలో విచ్ఛిన్నం చేస్తున్నారు. ఈ వ్యర్థాలను సేకరించేందుకు సుమారు 55 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం గమనార్హం. కోవిడ్‌ పంజా విసిరిన మార్చి 29 నుంచి మే 25  వరకు సుమారు 60 టన్నుల వ్యర్థాలను సేకరించి ఆయా కేంద్రాలకు తరలించినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. ఇందులో అత్యధికంగా గాంధీ ఆస్పత్రి నుంచి 30 టన్నుల జీవ వ్యర్థాలను సేకరించామన్నాయి.

కోవిడ్‌ వ్యర్థాలివే...
కోవిడ్‌ సోకిన రోగులకు ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో వాడిన మాస్క్‌లు, గ్లౌస్‌లు, దుస్తులు, మలమూత్రాలు, సిరంజీలు, కాటన్, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లు, మెడిసిన్స్‌ కవర్స్‌ తదితరాలను కోవిడ్‌ వ్యర్థాలుగా పరిగణిస్తున్నారు. వీటిని నిర్లక్ష్యంగా ఇతర జీవ వ్యర్థాలతో పాటే పడవేస్తే వ్యాధి విజృంభించే ప్రమాదం పొంచి ఉండడంతో పీసీబీ వర్గాలు, «శుద్ధి కేంద్రాల నిర్వాహకులు వీటిని ప్రత్యేక శ్రద్ధతో సేకరించి జాగ్రత్తగా శుద్ధి కేంద్రాలకు తరలిస్తున్నారు.  ప్రధానంగా జీవ వ్యర్థాలను శుద్ధి చేసే కామన్‌ బయోమెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ కేంద్రాలు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, వనపర్తి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో 11 వరకు ఉన్నాయి. 55 ప్రత్యేక వాహనాల ద్వారా ఈ కేంద్రాలకు నిత్యం కోవిడ్‌ వ్యర్థాలు చేరుతున్నాయి. వీటిని రెండు విడతలుగా ప్రత్యేక యంత్రాల్లో కాల్చి బూడిద చేస్తున్నారు. అనంతరం దీనిని దుండిగల్‌లోని హజార్డస్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్రానికి తరలించి ప్రత్యేక బాక్సుల్లో నిల్వ చేసి పూడ్చి వేస్తున్నారు. కోవిడ్‌ వ్యర్థాలను శుద్ధి చేస్తున్న 11 కామన్‌ బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ కేంద్రాల్లో సుమారు 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top