చలో.. ఫారిన్‌ టూర్‌!

GHMC Planning to Foreign Educational Trip - Sakshi

అధ్యయనం పేరిట సింగపూర్, మలేసియా పర్యటన

సిద్ధమవుతున్న జీహెచ్‌ఎంసీ ‘స్టాండింగ్‌’ కమిటీ

అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన

‘ప్రయోజనం’ ఉంటుందా అని ప్రశ్నలు!

గతానుభవాలతో అనుమానాలు

సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు సింగపూర్, మలేసియా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను  ఇటీవల జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో  ప్రభుత్వ అనుమతి కోరేందుకు  ఏకగ్రీవ తీర్మానం చేశారు. పనిలో పనిగా కేవలం తమ కోసమే అయితే బాగుండదని భావించి కాబోలు...తమతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, ఆరు జోన్ల కమిషనర్లు, జీహెచ్‌ఎంసీలోని అందరు ఐఏఎస్‌లను కూడా కలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు, సమన్వయం తదితర బాధ్యతల్ని ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌కు అప్పగిస్తూ తీర్మానించారు. ప్రస్తుతం కేవలం స్టాండింగ్‌ కమిటీ సభ్యులకే పరిమితమైన ఈ ‘అధ్యయన’ యాత్ర ఇంతటితో ఆగుతుందా.. లేక అందరు కార్పొరేటర్లకూ ఉంటుందా అన్నది వేచి చూడాల్సిందే. గత పాలక మండళ్లలోనూ కార్పొరేటర్లు అధ్యయన యాత్రల పేరిట దేశంలోని పలు నగరాలను చుట్టివచ్చినప్పటికీ, అవి విహార యాత్రలుగా మిగిలాయి తప్ప, అక్కడి అధ్యయనంతో ఇక్కడ ఏం అమలు చేశారో వారికే తెలియాలి. 

లోకాయుక్త ఆక్షేపించినా..
గత పాలకమండళ్లలోని కార్పొరేటర్లు అధ్యయనయాత్రల పేరిట ఆయా నగరాలను చుట్టిరావడం.. వాటి వల్ల ప్రజాధనం దుర్వినియోగమవడం తప్ప ఎలాంటిప్రయోజనం లేదని లోకాయుక్త అభిప్రాయపడింది.  దాంతోపాటు కనీసం కార్పొరేషన్‌ స్థాయి కూడా లేని నగరాల పర్యటనలు అనవసరమని స్పష్టం చేయడమే కాక   ఒక్కో కార్పొరేటర్‌కు గరిష్టంగా రూ.80 వేలు మించి ఖర్చుచేయరాదని పరిమితి విధించడంతో తర్వాతి దశలో  అధ్యయనాల పేరిట పెద్ద నగరాలను ఎంచుకున్నారు. ఖర్చుపై కట్టడితో ఏటా దాదాపు రూ.4 కోట్లయ్యే ఖర్చు రూ.1.5 కోట్లకు తగ్గింది. అధ్యయనం అనంతరం తీసుకున్న చర్యలను సైతం నివేదించాలని సూచించడంతో అధ్యయనం తర్వాత నివేదికలు ఇవ్వడం ప్రారంభించారు. అంతకుమించి  ఇక్కడ అమలు చేసిందంటూ ఏమీ లేదు.

ఏం నివేదించారు... ఏం చేశారు.. ??ఫుట్‌పాత్‌లను పట్టించుకోలేదు..
2011లో స్టడీటూర్‌లో భాగంగా  ఢిల్లీ, చండీగఢ్, సిమ్లా, అమృత్‌సర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లతో సహ పలు నగరాలు పర్యటించి వచ్చిన కార్పొరేటర్లు..చండీగఢ్‌లోని ఫుట్‌పాత్‌లు బాగున్నాయని భావించారు.  అక్కడ అన్ని ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులు, లేన్లు, బై లేన్లలో కూడా పాదచారులకు తగిన ప్రాధాన్యతనివ్వడాన్ని గుర్తించారు. పాదచారులు, వాహనాల రద్దీకి అనుగుణంగా ఫుట్‌పాత్‌లు తగిన వెడల్పుతో ఉండటాన్ని నివేదికలో ప్రస్తావించారు. ఫుట్‌పాత్‌లపై ప్రజలు నడవడానికే తప్ప ఇతరత్రా ఏ ఆటంకాలూ లేకపోవడంతో ప్రమాదాలు లేకపోవడాన్ని కూడా పేర్కొటూ హైదరాబాద్‌లోనూ అలాంటి ఫుట్‌పాత్‌లవసరమని భావించారు. ఈ నివేదికనిచ్చి దాదాపు ఎనిమిదేళ్లయినా ఇంతవరకు ఈ దిశగా చేసిందంటూ ఏమీలేదు. పైపెచ్చు చండీగఢ్‌ ప్రణాళికబద్దంగా నిర్మించిన నగరమైనందున అక్కడి సదుపాయాలు ఇక్కడ కల్పించలేమని తేల్చిపారేశారు.
జీహెచ్‌ఎంసీ  ఈవీడీఎం డైరెక్టర్‌గా విశ్వజిత్‌ కంపాటి  బాధ్యతలు చేపట్టాకే ఇటీవలి కాలంలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగిస్తుండటం తెలిసిందే.

ప్రత్యేక కమిటీలేవీ..?
ప్రజా సమస్యల్ని సత్వరం  పరిష్కరించేందుకు  చండీగఢ్‌లో  కార్పొరేటర్లతో  స్పెషల్‌ కమిటీలు నియమించారు. అలాంటి వాటిల్లో  మండీ కమిటీ, పనులు– టెండర్ల కమిటీ, వాటర్‌వర్క్స్, సివరేజి కమిటీ తదితరమైనవి ఉన్నాయి. అలాంటివి ఇక్కడా ఏర్పాటు చేయాలనుకున్నా, చేసిందేమీ లేదు. 

దుకాణాలు.. వ్యాపారుల కమిటీ..  
దుకాణాలు.. వ్యాపార సంస్థల పరిసరాల్లో పరిశుభ్రత బాధ్యత లు నిర్వహించేందుకు దుకాణాలు, వ్యాపారుల కమిటీగా మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అపరిశుభ్ర, అనారోగ్యకర వాతావరణం ఉంటే.. అందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ కమిటీదే. ఆయా ప్రాంతాల్లో క్రమం తప్పకుండా చెత్త తరలింపు బాధ్యత కూడా దీనిదే. ఈ కమిటీ గురించి అసలు పట్టించుకోలేదు.  ప్రస్తుతం స్వచ్ఛ కార్యక్రమాల కోసం ఎన్నో పనులు చేస్తున్న జీహెచ్‌ఎంసీ ఈ కమిటీని  ఏర్పాటుచేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. 

వ్యాపార జోన్లు..  
ఢిల్లీలో మాదిరిగా  ఆయా వ్యాపారాలు, ట్రాఫిక్‌రద్దీని బట్టి గ్రీన్, ఎల్లో, రెడ్‌ జోన్లుగా ఏర్పాటు చేయాలని సూచించారు.  దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా అమలు కాలేదు. వీటి ఏర్పాటు కోసం చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులైతే  అందజేసినప్పటికీ,  అమలు కావడం లేదు. వెస్ట్‌జోన్‌లో త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.  
సిమ్లాలో మాదిరిగా ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల్ని నిషేధించాలని సూచించగా.. అందుకు కొంతమేర ఏర్పాట్లు చేసినప్పటికీ అనంతరం విస్మరించారు. తిరిగి మళ్లీ ఇప్పుడు అడపాదడపా చర్యలు తీసుకుంటున్నారు. 

సైన్‌బోర్డులదీ అదే దారి.. 
ఫుట్‌పాత్‌లతో పాటు అక్కడ సైన్‌బోర్డులు స్థానికులతో పాటు పర్యాటకులకూ ఉపయుక్తంగా ఉండటాన్ని ప్రస్తావించారు. అదే తరహాలో నగరంలోని అన్ని రహదారుల నుంచి ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లే మార్గాలు తెలిసేలా ..  ప్రముఖ ప్రాంతాలను గుర్తించేలా సైనేజీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. తద్వారా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి, ద్విచక్రవాహనదారులకు సదుపాయంగా ఉండటమే కాక, ప్రమాదాలు తగ్గగలవని అభిప్రాయపడ్డప్పటికీ చేసిందంటూ ఏమీ లేదు. ఆ తర్వాత గ్రేటర్‌ మొత్తం సైనేజీల ఏర్పాటుకు కన్సల్టెంట్స్‌తో నివేదిక రూపొందించి దాదాపు రూ. 80 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. అందులో భాగంగా  2012లో కాప్‌ సందర్భంగా ఎంపిక చేసిన మార్గాల్లో  దాదాపు రూ. 10 కోట్ల పనులు మాత్రం చేశారు. ఆ తర్వాత మరిచారు.
ఇటీవల పోలీసుల సూచనల మేరకు తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైనేజీల ఏర్పాటుకు దాదాపు రూ. 4.50 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. కొన్ని మార్గాల్లో పనులు చేపట్టారు.
గవర్నర్‌ నరసింహన్‌ సైతం నగరంలో సైనేజీలు లేకపోవడాన్ని ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించడం ఈ సందర్భంగా గమనార్హం.

ఇప్పటి వరకు చుట్టి వచ్చిన నగరాలు..
కార్పొరేటర్లు ఇప్పటి వరకు చుట్టివచ్చిన నగరాల్లో  ఢిల్లీ, చండీగఢ్, సిమ్లా, అమృత్‌సర్, ఉదయ్‌పూర్, కోల్‌కత్తా, ముంబై, అహ్మదాబాద్, జైపూర్, పుణె, జో«ధ్‌పూర్, డార్జిలింగ్, గ్యాంగ్‌టక్‌ తదితరమైనవి ఉన్నాయి.

హ్యాండీకామ్‌లు అందుకున్నారు..  
గత పాలకమండళ్లలో అధ్యయన యాత్రలతోపాటు లాప్‌టాప్‌లు, హ్యాండీకామ్‌లు వంటివాటిని పొందారు. ప్రస్తుత పాలకమండలిలోనూ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఐఫోన్లు, ఐపాడ్లు వంటివి పొందారు.  

అధికారులు సైతం...
గతంలో అధికారులు విడిగా  ఆయా అంశాల్లో అధ్యయనం కోసం ఆయా దేశాలు చుట్టివచ్చారు.  ఘనవ్యర్థాల నుంచి విద్యుత్‌ తయారీకి సంబంధించిన అంశంపై అప్పటి కమిషనర్‌ కృష్ణబాబు, ఈఈ సుధాకర్‌లు  చైనా వెళ్లి వచ్చారు.  ‘ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌’ కార్యక్రమంలో పాల్గొనేందుకు అప్పటి  అడిషనల్‌ కమిషనర్‌(ఫైనాన్స్‌) అశోక్‌రెడ్డి అమ్‌స్టర్‌డ్యాం, బార్సిలోనాలకు వెళ్లి వచ్చారు. ఆధునిక సాంకేతికత, నైపుణ్యం ప్రపంచంలో ఎక్కడున్నా తమ ఉన్నతాధికారులను అధ్యయనానికి పంపిస్తామని కమిషనర్‌ దానకిశోర్‌ పేర్కొనడం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్‌ కూడా కార్పొరేటర్లను అధ్యయనయాత్రలకు పంపిస్తామని గతంలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top