గాంధీ వైద్యుల తీరు మారదా..

Gandhi Hospital Doctors Negligence Departed Infant - Sakshi

ఒకరికి చేయాల్సిన డెలివరీ మరొకరికి..

శిశువులను సైతం తారుమారు చేసిన వైనం

శిశువు మృతి, బాలింత పరిస్థితి విషమం

గాంధీ ఆస్పత్రి: ఒకరికి చేయాల్సిన డెలివరీ మరొకరికి చేయడమే కాకుండా శిశువులను సైతం తారుమారు చేసి, గాంధీ గైనకాలజీ వైద్యులు తమ జీవితాలతో ఆడుకున్నారని బాధితులు ఆరోపించారు. శిశువు మృతి చెందడంతోపాటు బాలింత పరిస్థితి కూడా విషమంగా ఉందని, దీనికి కారణమైన వైద్యులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు పోలీసులను ఆశ్రయించారు. బాధిత మహిళ భర్త ఎనగందుల హరీశ్‌తోపాటు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన సమత, హరీశ్‌ భార్యాభర్తలు.

ఏడునెలల గర్భవతి అయిన సమతను ఈనెల 11వ తేదీన వరంగల్‌ సీకేఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అదే రోజు రాత్రి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చి గైనకాలజీ విభాగం లేబర్‌ వార్డులో చేర్పించారు. 12వ తేదీ రాత్రి ఐసీయూకు రమ్మని పిలిచి, అత్యవసర పరిస్థితుల్లో డెలివరీ చేశామని చెప్పి మగశిశువును చూపించారు. ట్యాగ్‌లో మాత్రం ఆడశిశువుగా నమోదు చేశారు. 15వ తేదీ ఉదయం శిశువు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఇచ్చి, గంట తర్వాత శిశువు మృతి చెందిందని చెప్పి మగ శిశువు మృతదేహాన్ని ఇచ్చారని, మరణ ధ్రువీకరణ పత్రంలో మాత్రం ఆడశిశువుగా నమోదు చేశారని చెప్పారు. కేస్‌షీట్, ట్యాగులలో ఉన్న ఫిమేల్‌ను మేల్‌గా మార్చి, మరణ ధ్రువీకరణ పత్రంలో మేల్‌గా సరిదిద్దారని తెలిపారు.

సదరు ట్యాగులను సిబ్బందే తీసుకున్నారని, ఆర్‌ఎంఓకు ఫిర్యాదు చేయగా ట్యాగ్‌ విషయంలో తప్ప అన్నీ సక్రమంగానే ఉన్నాయని నమ్మించారని తెలిపారు. కేస్‌షీట్‌లోనూ ఫిమేల్‌ను మేల్‌గా, శిశువు బరువు 1 కేజీకి బదులుగా 900 గ్రాములని, పుట్టిన సమయం కూడా మార్పు చేశారని ఆరోపించారు. అదే కేస్‌షీట్‌లో సమతకు బదులుగా మాధవి, లక్ష్మమ్మలకు చెందిన రిపోర్టులు ఉన్నాయన్నారు. మాధవి, లక్ష్మమ్మ రిపోర్టుల ఆధారంగా సమతకు వైద్యచికిత్సలు అందించారని, సమత చేతిపై భవానీ అనే పేరు రాసి ఉన్నట్లు తర్వాత గుర్తించామన్నారు.

భవానీకి జరగాల్సిన డెలివరీ సమతకు చేశారని, ఏడునెలలకే డెలివరీ చేసి శిశువు మృతికి, బాలింత సమత ప్రాణాపాయస్థితికి కారణమైన వైద్యులు, సిబ్బందిపై తగిన చర్యలు చేపట్టి న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. అయితే డెలివరీ కోసం వచ్చే గర్భిణీల చేతులకు ట్యాగులు మాత్రమే కట్టి వివరాలు అందులో పొందుపర్చుతామని, అరచేతిపై పేర్లు రాసే పద్ధతి లేదని గాంధీ వైద్యులు స్పష్టం చేస్తున్నారు.  

నలుగురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ 
బాధితుడు హరీశ్‌ ఫిర్యాదు మేరకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. కమిటీలో కృష్ణమోహన్‌ (జనరల్‌ సర్జరీ హెచ్‌ఓడీ), డాక్టర్‌ జార్జ్‌ (పీడియాట్రిక్‌ ప్రొఫెసర్‌), రాజారావు (జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ), పద్మ (లేడీ ఆర్‌ఎంఓ)లు సభ్యులుగా ఉంటారని, బుధవారం సాయంత్రంలోగా నివేదిక అందిస్తారని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని శ్రవణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top