సర్కారు గొర్రెలకు ఉచిత దాణా

Free feed for sheeps says minister Srinivas Yadav - Sakshi

పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వేసవిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు రూ.66 కోట్లతో ఉచితంగా దాణా పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.53 లక్షల మందికి 53 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే కాకుండా వాటికి దాణా, నీరు, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. యూనిట్‌కు 4 బస్తాల దాణా అందిస్తామన్నారు. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించామని, చనిపోయిన వాటి వివరాలను అధికారులకు తెలియజేస్తే క్లెయి మ్స్‌ చెల్లిస్తారన్నారు. గొర్రెల పెంపకందారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.ఆరు లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇస్తామన్నారు.  రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఆధునిక సౌకర్యాలతో గొర్రెల పెంపకంపై శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ కోతలు ఇచ్చే మేలు రకపు పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై రైతులకు ఇస్తామన్నారు. 

వెయ్యి కోట్లతో మత్స్యశాఖ అభివృద్ధి: మత్స్యరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తలసాని వెల్లడించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, మత్స్యశాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని వారిని ఆదేశించారు. మత్స్య విత్తన అభివృద్ధి పథకం కింద రూ.204 కోట్లతో హేచరీలు, విత్తన క్షేత్రాల బలోపేతం వంటివి చేపడుతున్నామన్నారు. చేపల వేట కోసం మత్స్యకారులకు రూ.82 కోట్లతో సబ్సిడీపై క్రాఫ్ట్‌లు, వలలను పంపిణీ చేస్తామన్నారు. రూ. 370 కోట్లతో చేపల మార్కెటింగ్‌కు అవసరమైన చర్యలను చేపడతామన్నారు. 201718 సంవత్సరంలో 51 కోట్ల చేపపిల్లలను రూ.42 కోట్ల ఖర్చుతో 11,067 జలాశయాల్లో విడుదల చేశామన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top