కారుకేదీ కళ్లెం!

Four Car Accidents in One Day Hyderabad - Sakshi

నగరంలో ఠారెత్తిస్తున్న కార్లు

ఒకేరోజు నాలుగు కారు ప్రమాదాలు

ఇద్దరు మృతి, మరో పది మందికి గాయాలు

అతివేగం, మద్యం మత్తు కారణంగానే ఉదంతాలు

సంస్థాగత లోపాలతోనూ నిత్యం ఎన్నో ఇబ్బందులు

నగరంలో కార్లు ఠారెత్తిస్తున్నాయి. పెరిగిన కార్ల సంఖ్యప్రమాదాలనూ పెంచుతున్నాయి. పలువుర్ని మృత్యుముఖ్యంలోకి నెడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచిబుధవారం ఉదయం వరకు హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్లలో జరిగిన నాలుగు ప్రమాదాల్లోఇద్దరు అశువులుబాయగా... దాదాపు పది మంది వరకుక్షతగాత్రులుగా మారారు. వీటికి ముందు రోజు జరిగిన యాక్సిడెంట్స్‌ మరికొన్ని ఉన్నాయి. ఈ ప్రమాదాలకు అతివేగంతో పాటు మద్యం మత్తే కారణంగా ఉన్నాయి. కేవలం ఇవే కాదు...గ్రేటర్‌ పరిధిలో తరచుగా ఏదో ఒక ప్రాంతంలో కారు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యధిక
ప్రమాదాలు ఓవర్‌ స్పీడింగ్‌ వల్లేనని పోలీసులు చెబుతున్నారు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు వివరిస్తున్నారు. ఏటా నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తేలికపాటివాహనాలుగా పిలిచే కార్ల వాటా పది శాతానికి పైగా ఉంటోంది. 

సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో కార్లు జనాలను భయపెడుతున్నాయి. వరుస ప్రమా దాలతో వణికిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా జరిగిన కారు ప్రమాదాలు పలువురి ప్రాణాలు తీయగా..పదుల సంఖ్యలో తీవ్ర గాయాలకు గురయ్యారు. నగరంలో కార్ల వంటి తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో అత్యంత సంచలనాత్మక ఘటనలూ ఉంటున్నాయి. బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలోని పంజగుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన చిన్నారి రమ్య ఉదంతం, నారాయణగూడ ఫ్లైఓవర్‌పై పట్టపగలు ఓ నిండు ప్రాణాన్ని తీసిన వైనం...ఇలా ఎన్నో సంచలనాత్మక ఉదంతాలు సిటీలో చోటు చేసుకున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా మద్యం మత్తులో డ్రైవింగ్‌ చెయ్యడంతో పాటు నిర్లక్ష్యంగా వాహనం నడపడం కూడా ఓ కారణంగా మారుతోంది. వీటికితోడు నగరంలోని రహదారుల్లో ఉన్న ఇంజినీరింగ్‌ లోపాలు, డ్రైవర్ల నిద్రమత్తు సైతం ప్రమాద హేతువులుగా మారుతున్నాయి. సిటీలో వంపులు లేకుండా ఉన్న రహదారుల్ని వేళ్ల మీద లెక్కట్టొచ్చు. అందులోనూ అనేక బాటిల్‌నెక్స్‌ ఉంటాయి. ఇవన్నీ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. 

డ్రైవింగ్‌పై పూర్తి పట్టులేకపోడంతో...
ఇటీవల కాలంలో నగరంలో కార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ పెరగడం, ఫైనాన్సింగ్‌ విధానాలు ఇలా అనేక కారణాల నేపథ్యంలో కార్లు ఖరీదు చేస్తున్న వారు ఎక్కువగానే ఉంటున్నారు. వీరంతా ప్రాథమికంగా వివిధ డ్రైవింగ్‌ స్కూళ్లల్లోనో, పరిచయస్తుల వద్దో డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు. ఆ సమయంలో వీరి దృష్టంతా స్టీరింగ్, క్లచ్, బ్రేక్‌ల పైనే ఉంటోంది. ఈ మూడింటినీ నిర్వహించగలిగితే ఎక్కడైనా వాహనం నడుపవచ్చని భావిస్తుంటారు. అయితే హఠాత్పరిణామాలు, మార్జిన్స్, ఓవర్‌ టేకింగ్‌ తదితర సందర్భాల్లో తీసుసుకోవాల్సిన జాగ్రత్తలపై వీరికి పూర్తి స్థాయిలో పట్టు ఉండట్లేదు. దీంతో నామ్‌ కే వాస్తేగా నేర్చుకుని రోడ్ల పైకి వస్తున్న వాహనచోదకులు అనేక సందర్భాల్లో ప్రమాదాలకు లోనుకావడంతో పాటు కారకులుగానూ మారుతున్నారు. దీనికి తోడు డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ విధానంలో ఉన్న లోపాలూ ఈ తరహా ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.  
ఇక వీకెండ్స్‌లో డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలకు సరిపోను సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్నే మందుబాబులు తమకు అనుకూలంగా మార్చుకుని రెచ్చిపోతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
స్పీడ్‌ థ్రిల్స్‌... బట్‌ కిల్స్‌ అనే నానుడిని పోలీసు, ఆర్టీఏ విభాగాలు నిత్యం ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ హైఎండ్‌ వాహనాల్లో/వాహనాలపై, వీలున్నంత వేగంగా దూసుకుపోవడం కొందరు వాహనచోదకులకు నిత్యకృత్యమైంది. రద్దీ రోడ్లలోనూ విచ్చలవిడి స్పీడుతో, విన్యాసాలతో దూసుకుపోయే యువత ఎందరో ఉంటున్నారు. రాత్రి వేళల్లో, విశాలంగా..ఖాళీగా కనిపిస్తున్న రోడ్లపై వీరి విషయం ఇక చెప్పక్కర్లేదు.  
నగరంలోని రోడ్ల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం తదితర అంశాలపైనే ఇక్కడ పరిగెత్తే వాహనాలు ఆధారపడి ఉంటాయి. అయితే సిటీలో సరాసరి వేగం గరిష్టంగా గంటలకు 18 కిమీగా ఉంటే ఇక్కడ అందుబాటులో ఉంటున్న, దిగుమతి చేసుకుంటున్న వాహనాల గరిష్టం వేగం గంటలకు 200 కిమీ కంటే ఎక్కువే ఉంటోంది. ఇదే అనేక సందర్భాల్లో ప్రమాదాలకు హేతువుగా మారింది. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. ప్రమాదాలకు లోనవుతున్న వాటిలో ద్విచక్ర వాహనాల తర్వాతి స్థానం కార్లదే.  

సిటీలో స్పీడ్‌ లిమిట్స్‌ ఇలా:
నగరంలో వాహనాల వేగ పరిమితులకు సంబంధించి సిటీ పోలీసులు 2010 జనవరి 8న నోటిఫికేషన్‌ జారీ చేశారు. దాని ప్రకారం....
ఆటోలు, ఆటో ట్రాలీలు తదితరాల గరిష్ట వేగం గంటకు 35 కిమీ
కార్లు, తేలికపాటి వాహనాలు, ద్విచక్ర వాహనాలకు గంటకు 50 కిమీ
భారీ వాహనాలు, సరుకు రవాణా వాహనాలు, మినీ బస్సులకు గంటకు 40 కిమీ
ట్యాంక్‌బండ్, ఫ్లైఓవర్లపై అన్ని రకాల వాహనాల గరిష్టంగా గంటకు 40 కిమీ మించి పోకూడదు.
పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌ వేపై తేలికపాటి వాహనాలు గరిష్టంగా గంటకు 80 కిమీ, మధ్య తరహా వాహనాలు 65 కిమీ మించి పోకూడదు. దీనిపై ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు.

తేలికపాటి వాహనాల వల్ల జరిగినవి: 27.7%
ఫోర్‌ వీలర్స్‌ వారు బాధితులుగా మారినవి: 5.5%
ఓవర్‌ స్పీడింగ్‌ వల్ల జరిగిన ప్రమాదాలు: 53%
మద్యం మత్తులో చోటు చేసుకున్నవి: 6% ఇతర కారణాలు : 7.8%

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top